ప్ర‌తిప‌క్షాల‌పై మంత్రి కెటిఆర్ ఫైర్‌

 

TS MINISTER KTR
K T R

హైదరాబాద్: దేశం అబ్బురపడేలా కేసీఆర్ పాలన ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కితాబిస్తుంటే.. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం అధికార దాహంతో టీఆర్ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ సీఎం గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే.. కేసీఆర్ అభివృద్ధిపై మాట్లాడేవారని ప్రధాని మోదీ దేశ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్‌వాళ్లు కిందమీదా పడుతున్నారని విమర్శించారు. కుటుంబ పాలనపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. దెయ్యాలు సిగ్గుపడేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. గాంధీ అని లేకపోతే రాహుల్ కార్పోరేటర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆరే గెలుస్తారని రాహుల్‌తో పాటు అందరికి తెలుసునని, ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలయత్నాలుగానే మిగిలిపోతాయన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలపైనా మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. మంచి పాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రులు అభినందిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్‌ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఈసారి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా గెలవరని జోష్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ బిడ్డలే అని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గడిచిన నాలుగేళ్లలో ఒక్కరోజు కూడా అల్లర్లు, గొడవలు జరగలేదన్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని జలవిహార్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ప్రగతి నివేదన సభ విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సమీకరణకు ప్రతి నియోజకవర్గానికి టార్గెట్‌లు పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. యూత్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీలు తీయాలన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్, పద్మారావు నాయకత్వంలో భారీగా జన సమీకరణ చేయాలన్నారు. ప్రజలు సభకు వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.