ప్రొ క‌బ‌డ్డీ విజేత పాట్నా పైరేట్స్‌

patna pirates
patna pirates

పట్నా: పట్నా పైరేట్స్‌ బలమైన ప్రత్యర్థి ఎదురుగాఉన్నా.. కఠిన పరిస్థితులు ఎదురైనా.. మెరుపు రైడింగ్‌, పటిష్టమైన డిఫెన్స్‌తో అదరగొట్టి ప్రొ కబడ్డీ లీగ్‌-5 ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో పైరేట్స్‌ 55-38తో గుజరాత్‌ను ఓడించింది. గ‌త మూడు మ్యాచ్‌ల్లో తన రైడింగ్‌తో పట్నా విజయాల్లో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ నర్వాల్‌ (19).. ఈసారీ ఆపద్బాందవుడయ్యాడు. పట్నా 6-14తో వెనుకబడి ఆపై 15-15తో స్కోరు సమం చేయగలిగిందంటే అతడి చలువే! మరోసారి తన రైడింగ్‌తో మాయ చేసిన నర్వాల్‌.. ఒకే ప్రయత్నంలో ముగ్గురు ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్‌ చేసి జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చాడు. ఆ తర్వాత గుజరాత్‌ను ఆలౌట్‌ చేసిన పట్నా.. 17-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడ నుంచి రైడింగ్‌, ట్యాకిలింగ్‌లో పైరేట్స్‌ రెచ్చిపోయింది. నర్వాల్‌తో పాటు విజయ్‌, జైదీప్‌ కూడా అందుకోవడంతో పాయింట్లను పెంచుకుంటూపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 21-18తో ఆధిక్యంలో నిలిచిన పట్నా.. ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 29-22తో ముందంజలో నిలిచిన పైరేట్స్‌.. 40-35తో విజయానికి చేరువైంది. అయితే ఈ దశలో సచిన్‌ (11) విజృంభించడంతో గుజరాత్‌ పుంజుకున్నా.. అది అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే సరిపోయింది. ఆఖరి సెకన్లలో రైడ్‌కు వెళ్లిన మోను గోయత్‌ పాయింట్‌ తీసుకు రావడంతో పట్నా సంబరాల్లో మునిగిపోయింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నాకు ఇది వరుసగా మూడో టైటిల్‌. 2016 సీజన్లో జరిగిన రెండు టోర్నీల్లోనూ ఆ జట్టే గెలిచింది.