ప్రేమ ఎంత మధురం

COUPLE-1
COUPLE

ప్రేమ ఎంత మధురం

కొండల్ని బద్దలు చేసేంత విశ్వాసం నీపై నాకున్నా ప్రేమ లేకపోతే ప్రియనేస్తమా అదంతా వ్యర్థమే కదా! కాల్చబడేందుకు నా దేహాన్ని కొవ్వొత్తిగా మార్చినా, కాసింతైనా అభిమానం లేకపోతే ఆ త్యాగానికి అర్థమే లేదుకదా ప్రియతమా! కోటిరూపాయల విలువైన ప్లాటినంతో తయారైన ఉంగరాన్ని నీకోసం సప్తసముద్రాలను దాటి తెచ్చి నీకు కానుకగా సమర్పించినా నీపై చిరుప్రేమను చూపించాల్సిన పరిస్థితిలో చూపించలేకపోతే ఆ కానుక గడ్డిపరకతో సమానమే. ఈ సృష్టికి మూలం ప్రేమ. సూర్యుడిచుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగా ప్రేమ చుట్టూ విశ్వంలోని కోటిప్రాణి తిరుగుతున్నది. ఒక జీవికి ప్రాణం ఉన్నదంటే దానికి గుర్తు శ్వాసే ఆధారం.

అలాగే ఒక ప్రాణి మనుగడకు ఆధారం ‘ప్రేమే కదా! అయితే నేటికాలం ప్రేమలు ఎలాగున్నాయి? ప్రేమించివాడు మరొక స్నేహితుడి వివాహానికి అనుమతి ఇవ్వలేదని, అనుమానిస్తున్నాడని ఆత్మహత్య చేసుకోవడం, ప్రేమను నిరాకరించాడని చనిపోవడం ఇవే కనిపిస్తున్నాయి. తరాలు మారుతున్న హైటెక్‌నాగరికతలో, సాఫ్ట్‌వేర్‌ కల్చర్‌కి సైతం ప్రేమ అనురాగం లేని విశ్వమనుగడను ఊహించలేం. కాని ఆధునిక పోకడలు, టెక్నాలజీ సదుపాయాలు, నెట్‌ కల్చర్‌, టచ్‌స్క్రీన్‌ సెల్‌ఫోన్లు వంటి సదుపాయాలు ప్రేమ అనే సున్నితమైన మధుర భావం నడిసమాజంలో దిగంబరత్వంతో అల్లాడిపోతున్నది. క్షణికమైన శారీరకవాంఛలతో ‘ప్రేమ అనే విలువైన పదం ఓ ‘నాటక మాయాబజార్‌లో అపహాస్యం చేస్తున్నది. వాడి పోయి, రాలిపోయే ఎండు విత్తనం సైతం రేపటిరోజు చిగురిస్తాననే ఒక నమ్మకంతో అది కనుమరుగైపోతుంది. కొన్నిరోజులకు ఏదో ఒక చోట మొగ్గగా చిగురిస్తుంది. పచ్చని ఫలాలతో తృప్తినిస్తుంది. కానీ మన ప్రేమ మొగ్గగా ఫలించలేకపోతున్నది, ఆ ప్రేమవిత్తనం ఎండిపోయి, కుళ్లిపోయి, పాతాళంలో కూరుకునిపోతున్నది.

ప్రేమలో పడడం తేలిక కానీ ఆ ప్రేమను కాపాడుకోవడంలో ఎంతవరకు విజయం పొందుతున్నారు? అనేదాన్ని ప్రశ్నించు కోవాలి. ప్రేమ స్వచ్ఛమైనది. దేవ్ఞడు మనకిచ్చిన ఓ అపూర్వ కానుక ప్రేమ. అది పవిత్ర మైనదిగా, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించేదిగా తద్వారా దేవ్ఞడికి అది మహిమ కరంగా ప్రేమను కాపాడుకున్నప్పుడే అసలైన ప్రేమకు నిర్వచనం. ప్రేమపేరుతో మోసం చేయడం కొందరికి అలవాటు, మరికొందరికి అదొక సరదా సన్నివేశం, ఇంకొందరికి అదొక మానసిక రుగ్మత. కానీ నిజమైన ప్రేమ ఎదుటివారి శ్రేయస్సును మాత్రమే కాదు, సమాజక్షేమానికి బాటలు వేస్తుంది. ప్రేమ కోసం తపించే ప్రతివారికి ప్రతిరోజూ వసంతమే. ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేయడం ఒక ఆవేదన అయితే దాన్ని పండించుకోవడం మాత్రం ఆదర్శమే. త్యాగమైన ప్రేమ ఆవేదనలో ఒక జ్ఞాపకంగా, మాననిగాయంగా మిగిలిపోతే దాన్ని ఫలింపచేసుకోవడం, ఆ పోరాటం ఒక మంచిపనికి సూచన.

ప్రేమ ఒక అద్భుత బంగారు దీపం. దాన్ని తాకిన ప్రతిసారీ నాకొక బహుమానం ఇస్తూ, నాలో అద్భుతాలను సృష్టిస్తుంది. రోజా పూలు ఎన్ని రంగుల్లో ఉన్నా, నా మనసు మాత్రం రంగులు మారని పూల మకరందాలే. నా అంతర్మాత, బాహ్యంలోను వెచ్చటి ప్రేమగాలులు వీస్తూ, నీ ప్రేమ సందేశాలన్నింటిని నాచెంతకు మోసుకొస్తూ, ముచ్చటిస్తుంటే నాజీవితమే ధన్యమైపోతుంది. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దేవ్ఞడి ముఖాన్ని నేను చూస్తున్నానని భావిస్తాను. కొండలు పరలోకాన్ని ముద్దాడితే,

సముద్రఅలలు ఒకదానికొకటి చప్పట్లు కొట్టుకుంటుంటే, పువ్ఞ్వలు ఒకదానికొకటి క్షమించుకుంటుంటే, సూర్యకిరణాలు భూమిని స్పర్శిస్తుంటే, వెన్నెల వెలుగురెక్కలు సముద్రపు అలల్ని లాలిస్తుంటే నేను మాత్రం నిన్ను నాగుండె గదిలో దాచుకుని, మనసంతా ఆరాధిస్తూనే ఉంటాను అని ఒక ప్రేమికురాలి భావన ఇది. బహుమతులు ఇవ్వాలనే తపన ప్రతి ప్రేమికులకు ఉంటుంది. విలువైనవి ఇచ్చి ప్రేమను రుజువ్ఞ చేసుకోవాలని కొందరు అనుకుంటే, డబ్బు విలువ కంటే తన ప్రేమ ఎంత నిజాయితీయో నిరూపించుకోవాలని ఇంకొందరు అనుకుంటారు.

ఎవరు ఎలా అనుకున్నా మీరు ఇస్తున్న బహుమతి అది మీ ప్రేమ వృద్ధికి, ఒక స్థిరభావానికి, ఆనందానికి సంకేతంగా ఉండాలనేదాన్ని విస్మరించకండి. మనసు తెలుసుకుని, ఇష్టాలపై ఉండే అభిలాషను అర్థం చేసుకుని, భవిష్యత్తులో మీ భాగస్వామికి ఉండే కలలు, ఆశయాలు, ఆశలు ఏంటో గమనించి, వాటిని ప్రోత్సహించేలా మీ కానుకలు ఉంటే దానికి మించిన ఆనందం ఉండదు. ప్రేమికులకు కొన్ని సూచనలు మీ ప్రేమలో ఇరువ్ఞరి కుటుంబసభ్యులు కూడా భాగస్తులను గమనించాలి.

ప్రేమను పండించుకోవాలనే ఆరాటంలో పెద్దల్ని మోసగించవద్దు. మీ కెరీర్‌పై మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, కలలపై కూడా దృష్టిని ఉంచాలి. ప్రేమ బాధ్యతలను పెంచుతుందే తప్ప ఆ బాధ్యతలను తప్పించుకోవాలని చూడదు. అలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. ప్రేమకు మేజర్లు అయితే చాలు ఏ చట్టాలు ఏమీ చేయవని భరోసా మీకున్నా ఆ ప్రేమను శాశ్వతంగా నిలుపుకోవాలనే భరోసా మీ భాగస్వామికి, తల్లిదండ్రులకు కల్పించే సత్తా మీలో ఉండాలి.

అప్పుడే మీ ప్రేమ పదికాలాలపాటు వర్ధిల్లుతుంది. అది సమాజ హితం కూడా. ప్రేమ అంటే మోజు ఉన్నంతవరకు తిరిగి తర్వాత ముఖం చాటేయడం కాదు. ప్రేమ అది ఏదైనా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రేమకు మోసం తెలియదు. ప్రేమకు వంచన అంటే అసహ్యం. ప్రేమకు త్యాగమంటేనే ఇష్టం. ప్రేమకు ఫలించే గుణం తప్ప అర్థాంతరంగా తనువ్ఞ చాలించేంత పిరికితనమైనది కాదు. ప్రేమ ఎప్పుడూ ధైర్యంగా పోరాడుతుందే తప్ప ఓటమి ఎరుగదు. సర్వసమాజం తనకు వ్యతిరేకమైనా అంతిమం వరకు పోరాడి గెలుస్తుందే తప్ప నిరాశకు గురికాదు.

ప్రేమ ఒక జీవితాన్ని నిలుపుతుంది. ప్రేమ ఆ జీవితం మరెందరికో వెలుగునిస్తుంది. అంతిమంగా ఆదర్శంగా చరిత్ర పుటల్లో ముగింపు లేని పేజీలో నిరంతరం లిఖిస్తూనే ఉంటుంది. ఇదే అసలైన ప్రేమ. సమాజహితం కోరే ప్రేమ. మనం ఇలాంటి ప్రేమనే ఆధారం చేసుకుని, ముందుకు సాగిపోదాం.