ప్రశాంతంగా ధ్యానం

YOGA
కొత్తగా ధ్యానం చేయాలనుకునే వారు పాటించాల్సిన సూత్రాలు ఇవి –
– ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో బాసింపట్టు వేసుకుని వెన్నెముకని నిటారుగా ఉంచి కూర్చోవాలి. ప్రశాంతమైన మనసుతో ఉండాలి. గాలిని లోపలికి పీల్చుకోవాలి. అలా పీల్చుకునేటప్పుడు ఏదైనా పువ్వు సువాసనని ఆఘ్రాణి స్తున్నట్టు భావించాలి. పీల్చిన గాలిని నిదానంగా బయటకు వదలాలి. మీ శ్వాసమీద దృష్టి నుంచండి. పెదవులపై చిరునవ్వు చెదరనీయకండి.

– ఇప్పుడు మీ ధ్యాసని మీ శరీర అవయవాల వైపు మళ్లించండి. ముందుగా పాదాలతో ప్రారంభించండి. తరువాత కాళ్లు ఇంకా పైపైన శరీర భాగాలు పొట్ట, భుజాలు, ఛాతీ, మెడ ఇవన్నీ గమనిస్తూ వెళ్లండి.  తరువాత మొహం వరకు వెళ్లి మొహంలో అన్ని భాగాలు రిలాక్స్‌ అవుతున్నట్టు భావించాలి. పెదవులతో మొదలుపెట్టండి. తరువాత కళ్లు, కనుబొమ్మలు, చివరగా నుదురు.  ఒక్కోభాగానికి కొన్ని సెకన్ల కాలాన్ని కేటాయించాలి.

– ఇపుడు మీ దృష్టిని శ్వాసవైపు మళ్లించండి. రెండు మూడు నిముషాల పాటు మీ శ్వాస విధానాన్ని బాగా గమనించండి. మీరు పూర్తిగా ప్రశాంత మనస్కులైనట్టేనని తీర్మానించుకోండి. ఇక మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవైనా సరే వాటిని సాగనివ్వండి. అవి మంచివా, కాదా, తప్పా, ఒప్పా అనేది ఆలోచించకండి. వాటిని ఆపాలని ప్రయత్నించకండి. కేవలం వాటిని గమనిస్తూ ఉండండి.  మీ మెదడుని పూర్తి ప్రశాంతతలో ఉంచండి. దేనినీ నియంత్రించాలనుకోకండి. ఇలా కొన్ని నిముషాల పాటు ఉండండి.

– ధ్యానం నుంచి బయటకి వచ్చే విధానం కూడా క్రమంగా ఉంటుంది. మీ చుట్టూ వినిపిస్తున్న ధ్వనులు వినండి. శరీరంలో చిన్న కదలికలు తెచ్చుకోండి. మొహంలో చిరునవ్వు తెచ్చుకుని నిదానంగా కళ్లు తెరవండి. ధ్యానాన్ని చక్కగా అభ్యసించాలంటే ధ్యానంలో నైపుణ్యం సాధించిన గురువునుంచి శిక్షణ తీసుకుంటే మంచిది.