ప్రమాదంలో ప్రజారోగ్యం

                              ప్రమాదంలో ప్రజారోగ్యం

HOSPITAL
HOSPITAL

ఎంతో ఆధునిక విజ్ఞానం సముపార్జించుకున్నామని విర్రవీగే మానవజాతిపై ప్రకృతి విసురుతున్న సవాలుకు వారు వీరు అని తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. ఆ శక్తిముందు మానవుడు ఎప్పటికీ తలదించుకోవల్సిందన్న వాస్తవాన్ని చాటుతూ రకరకాల కొత్త వ్యాధులు ప్రభలిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బలైపోతుంటే కోట్లాదిమంది రోగపీడితులవుతున్నారు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క చరిత్ర ఉంటున్నది. ఎక్కడోపుట్టి ఎంతో కాలంగా నిగూఢంగా ఉండి ఒక్కసారిగాప్రజారోగ్యంపై విజృంభిస్తున్నాయి. డెంగ్యూ చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, ఎబోలా ఇలా రకరకాల వ్యాధులు ప్రజారోగ్యంపై విరుచుకుపడుతున్నాయి. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందినా ఎన్నో కొత్త మందులు కనుగొంటున్నా ఈ వ్యాధుల బారినుంచి కాపాడలేకపోతున్నారు. ఇక సీజన్‌ మారినపుడల్లా విజృంభిస్తున్న విషజ్వరాలుమరొకవైపు అల్లాడిస్తున్నాయి.

ఎందుకో ఏమోకానీ ప్రజారోగ్యంపై ప్రభుత్వం చూపాల్సినంత శ్రద్ధ చూపడంలేదేమోననిపిస్తున్నది. గత పక్షం రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్‌లోను ఇటు తెలంగాణలోను కురుస్తున్న వర్షాలతో ఈ విషజ్వరాలు విస్తరిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అంటువ్యాధి నానాటికీ ప్రాణాంతకంగా మారుతున్నాయి. శ్వాసకోశ వ్యాధుల బారిన పడినవారిపరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ముందు జాగ్రత్తలతో నివారించదగ్గ డయేరియాకు కూడా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కుక్కకాటు కారణంగా రేబిస్‌ ఇన్ఫెక్షన్‌కు గురయినవారిలో 90శాతం అసువులు బాస్తున్నారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు దేశం మొత్తం మీద దాదాపు 12 లక్షలమంది చికిత్సపొందుతున్నట్లు అధికారిక సమాచారమే అని చెపుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో రెండులక్షల 40 వేలకేసులకుపైగా నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 73 వేలు, తెలంగాణలో 73 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక సిఫిలిస్‌ వ్యాధితో బాధపడేవారు తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇక గుండెజబ్బులు, కిడ్నీరోగులు, ఇతర విషజ్వరాలు కూడావిజృంభిస్తున్నాయి. క్షయలాంటి వ్యాధులు నియంత్రణకు పాలకులు ఎంత శ్రద్ధతీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు కనిపించడంలేదు. ఇప్పటికీ క్షయ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెపుతున్నాయి. తెలంగాణలో మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యనిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 11వేల 750 మంది ఈ వ్యాధి కారణంగా బలవుతుండగా మరో 80వేల మంది కొత్తగా క్షయవ్యాధి బారినపడుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఇందులో చికిత్సకోసం నమోదవుతున్నవారు 60శాతం మాత్రమే. నమోదయిన కేసుల్లో అత్యధికం హైదరాబాదులో కాగా ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, వరంగల్‌ మేడ్చల్‌ తదితర జిల్లాలు వరుసక్రమంలో ఉన్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా క్షయవ్యాధి సోకిన రోగి చికిత్స ప్రారంభించి ఆ తర్వాత మధ్యలో ఆపుచేయడం మళ్లీ ఈ వ్యాధి పెరగడంతో చికిత్స తిరిగి ప్రారంభించడం పరిపాటిగా జరుగుతున్నది. దీనితో వ్యాధి ఇతరుల్లో కూడా వ్యాపిస్తున్నట్లు వార్తలందుతున్నాయి. ఇలాంటి రోగులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్షయ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రంలో ఏటా 23 కోట్ల రూపాయలు మంజూరుచేస్తున్నా వెచ్చించడంలో అధికారులు శ్రద్ధచూపకపోవడంతో 40శాతానికి మించి ఖర్చుచేయలేకపోతున్నారు. సిబ్బంది కొరత మరొకపక్క తీవ్రంగా వేధిస్తున్నది. గుండెజబ్బుల విషయంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ రంగంలోని వైద్యసంస్థల పనితీరు అంతకంతకూ దిగజారిపోతున్నదేమోననిపిస్తున్నది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఇటు తెలంగాణలో కానీ పోనీ దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఆసుపత్రుల్లో స్వీపర్లే ఇంజక్షన్లు ఇవ్వడం లాంటివి చేస్తున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు అద్దంపడుతున్నది. ఇక ప్రైవేటు వైద్యరంగం సామాన్యునికి అందుబాటులో లేనంతగా పెరిగిపోతున్నది.

వైద్యం ఒక వ్యాపారంగా రూపాంతరం చెందిందనే చెప్పవచ్చు. కార్పొరేట్‌ రంగంప్రవేశించినప్పటినుంచి వైద్యం అనేది బీద బిక్కి బడుగు వర్గాలకే కాక మధ్యతరగతి వర్గాలకు కూడా అందని పండుగా తయారయింది. రోగిని రోగాన్ని చూసి వైద్యంచేసే రోజులు పోయి రోగి జేబును చూసి వైద్యంచేసే రోజులు దాపురించాయి. సొంత డబ్బో, లేక బ్యాంకులనుండి అప్పోసప్పోచేసి నక్షత్ర హోటళ్ల స్థాయి మించిన ఆస్తులను నిర్మించడం ఆ తర్వాత పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టుకోవడం కోసం చేయరాని చేయకూడని పనులు కూడా కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వెనుకాడటంలేదు. అందరూ అలావ్యవహరిస్తున్నారని చెప్పడంలేదు. అందరూ అలా వ్యవహరించకపోయినా అధిక శాతం ఆమార్గానే పయనిస్తున్నారేమోననిపిస్తున్నది. ఇది రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ప్రభుత్వం ఈ విషయంలోప్రేక్షక పాత్ర వహిస్తున్నదనే విమర్శలు ఏనాటినుంచో ఉన్నాయి.

ఎలాంటి నియమనిబంధనలు ఇంతవరకూ రూపొందించలేకపోతున్నారు. రెండుమూడు దశాబ్దాలుగా అధ్యయనాలు కమిటీలతో కాలం గడుపుతున్నారే తప్ప సమగ్ర చట్టానికి రూపకల్పన జరగలేదు. ఎన్నో ఏళ్లు కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసుకుని పేదరికం నుంచి కొంతమేరకైనా బైటపడిన మధ్యతరగతి కుటుంబాలు ఎవరో ఒకరు ఇలాంటి వ్యాధి బారిన పడి కార్పొరేట్‌ వైద్యాన్ని ఆశ్రయిస్తే ఉన్నదంతా ఊడ్చుకుని పోయి మళ్లీ దారిద్య్రం పాలవుతున్నారు. ఆమాత్రం ఆర్ధిక స్తోమత లేనివారిపరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేవునిపై భారంవేసి కాలం గడుపుతున్నారు. ఉభయరాష్ట్రాల్లోను వేలాది కుటుంబాలు ఈసుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి.పాలకులు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
– దామెర్ల సాయిబాబా, ఎడిటర్‌, హైదరాబాద్‌