ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం సాధ్యమే

Venkaiah Naidu
జీవితంలో పరుగును భాగం చేసుకోవాలి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ(గాంధీనగర్‌) : సాంకేతిక నైపుణ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని, ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ విధివిధానాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేదే తన లక్ష్యమని , అమరావతి మారధాన్‌ పరుగులో పాల్గొన్న ఉత్సాహాన్ని చూస్తుంటే ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం సాధ్యమేనని అనిపిస్తుందని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం జియో అమరావతి రన్‌ బహుమతి ప్రధానోత్సంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహాత్మాగాంధీ రోడ్డులో 7.5కి.మీ జియో వైఫైను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని పరుగుల ద్వారా యువత సమకూర్చుకోవాలన్నారు. యువత కోసం రోజులో 5 నుండి 6కి.మీ మేర పరుగును అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామస్ధాయి నుండి జిల్లా స్ధాయి వరకు ఇటువంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాలను రూపొందించుకొని స్పూర్తి పొందాలన్నారు.

దేశం ఇప్పటికే ప్రపంచంలోనే మెరుగైన అవకాశాలు ఉన్న దేశంగా గుర్తింపు సాధించిందని, సంపద ఉందని, అభివృద్ధికి అదే కీలకమైన అంశంగా ఆయన అన్నారు. ఇటువంటి క్రీడాపోటీలను మరింతగా నిర్వహించుకోవాలన్నారు. మెరుగైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇబ్బందుల్లో ఉన్నా మనే భావనలో ఉంటే జీవితం మొత్తం ఇబ్బందిగానే ఉంటుందని, అందులో నుండి స్పూర్తిని పొంది ముందడుగు వేస్తేనే విజయం సాధించగలుగుతా మన్నారు. ఈ పరుగులో రాష్ట్ర మంత్రులు దేవినేని , కామినేని, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, విజయవాడ ఎం.పి కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్‌, బొండా ఉమా, గుంటూరు, కృష్ణా కలెక్టర్లు కాంతిలాల్‌ దండే, బాబు.ఎలతో పాటు, రాష్ట్ర డిజిపి జె.వి.రాముడు, ముఖ్యకార్యదర్శి సుబ్రమణ్యం, విజయవాడ మునిసిపల్‌ కమీషనర్‌ వీరపాండియన్‌ పరుగులో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని అభినందిస్తున్నారన్నారు. అనంతరం విజేతలయిన వారికి బహుమతులు అందజేశారు.

వ్యాయామం జీవితంలో ఒక భాగం కావాలి: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు 10 కె, 5 కె రన్‌లను ప్రారంభిస్తూ వ్యాయామం జీవితంలో ఒకనిత్యకృత్యంగా అలవాటు చేసుకోవా లన్నారు. ఈ రోజు పరుగులో పాల్గొనడానికి , కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినయువతను చూస్తుంటే ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించుకొని తీరతా మని తప్పక అనిపిస్తోందన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుచేస్తున్న దిశానిర్ధేశంలో ముందుకు అడుగులువేస్తూ అభివృద్ధిదిశగా పరుగులు పెడుతున్నామన్నారు. అందుకు అనుగుణంగా యువతకూడా కలిసి ముందుకు రావాలనికోరారు.4విభాగాల్లో 5కేటగిరిలుగా 6వేలకుపైగా పోటీదా రులు ఈ పరుగులో పాల్గొనడం పట్ల ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. జియోఅమరావతి మారధాన్‌రన్‌ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

పరుగులో పాల్గొన్న వారికి ఉత్సాహాన్నిచ్చిన సినీనటులు…
సినీ నటులు రామ్‌, శర్వానంద్‌లు పరుగులో పాల్గొన్న వారికి అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసారు.