ప్రతి పంటకు డిమాండ్‌!

kcr
kcr

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి
వివిధ పంట ఉత్పత్తులపై సిఎం కెసిఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌: ఆహార,వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని,వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత ఉందని టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందని, రైతులందరూ ఒకేరకమైన పంటలు వేయటం వల్ల జరిగే లాభ నష్టాలనను సంఘటిత పరచటం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంటల కాలనీగా విభజించాలని రైతు పండించే ప్రతి పంటకు డిమాండ్‌ లభించేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ప్రభుత్వ పరంగా నమ్మకమైన కల్తీరహిత బ్రాండెడ్‌ ఉత్పత్తులు జరగాలని, రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో వ్యవసాయం,ఉద్యానవన శాఖల మీద కోట్లాడి మంది అధారపడి వున్నారని,వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని, దేశం మొత్తంలోనే ఉత్తమమైన వ్యవసాయం, ఉద్యానవన, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతులలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలని సిఎం అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సిఎం చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంభించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తుల్లో భాగస్వాములను చేయటంపై, ‘ఈ సమీక్షా సమావేశం ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించిన అంశాలపై ఒక అవగాహనకు రావటానికి ఏర్పాటైంది. దుర దృష్టవశాత్తు చాలా విషయాల్లో సరైన గణాంకాలు లేకపోవడం వల్ల సరైన నిర్ణయానికి రావటం కష్టమవుతున్నది.ఈ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండుతుంది? ఎంత మేరకు పండ్ల ఉత్పత్తి జరుగుతున్నది? ఏ మేరకు ప్రజల ఆహార అవసరాలు తీరుతున్నవి? అనే విషయాలపై సరైన గణాంకాలు ఉండాలి. వ్యవసాయ,ఉద్యానవన శాఖలు, సంబంధిత ఇతర శాఖలు ఒకదానికి ఒకటి సంబంధ అనుబంధంగా పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి. దీనికోసం ఏమి చేయాలో ఆలోచి ంచాలి. దీని ద్వారా రైతుల్లో అశాంతి పూర్తిగా తొలిగిపోతుంది. దీనికి మొదటి అడుగడుగునా రైతు సమన్వయ సమితి ఏర్పాటు జరిగింది. వాళ్లకు క్రమపద్దతిలో శిక్షణ నివ్వాలి. తర్వాత వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగింది. భూమి లెక్కలు కూడా తేల్చటం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంతుందో తేలింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. ఇదంతా ఒక గొలుసుకట్టు కార్యక్రమంలా జరిగితే తద్వారా వ్యవస్థ బాగుపడితే చాలా మంచిది అని సిఎం అన్నారు.
‘రైతులందరూ ఒకేరకమైన పంట వేస్తే సమస్యలు తలెత్తుతాయి కనుక పంట మార్పిడి కోసం వాళ్లకు అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంత మార్పు రావాలి. అందరూ రైతులు ఒకేరకమైన పంట వేస్తే జరిగే లాభ నష్టాల మీద చర్చ జరగాలి. ముల్కనూరు గ్రామం అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్దతిలో రైతులను సంఘటిత పరచడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించడం జరిగింది. రైతులకు పలనా విధంగా నడుచుకుంటే లాభం కలుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు నమ్మకం కలిగించకపోతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్‌ గులాటిని ఢిల్లీలో కలిసి ఈ విషయాలలో వర్క్‌షాప్‌ నిర్వహించాలని మన రాష్ట్రానికి ఆహ్వానించాను. త్వరలో ఆయన మన రాష్ట్రానికి వస్తారు అని సిఎం చెప్పారు. ‘రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంట కాలనీలుగా విభజించాలి.రైతు పండించే పంటకు డిమాండ్‌ ఉండాలె. మన అహార అవసరాలేంటో తెలుసుకోవాలె. రైతాంగం ఏ పంటలు వేయడానికి అలవాటు పడ్డదో ఆర్థం చేసుకుని ఒకేసారి వాళ్ల మీద మన అభిప్రాయాలను రుద్దకుండా అంచలంచలుగా పంల కాలనీల విషయంలో అవగాహన కలిగించాలె,గ్రామీణ ఆహార అవసరాలతో పాటు,నగర-పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగు విధంగా ఉత్పత్తులు జరగాలె. కూరగాయాల,కొత్తిమీర,జీలకర్ర లాంటివి కూడా దిగుమతులు చేసుకోవడం దురదృష్టం, నగరాల-పట్టణాల దరిదాపుల్లో కూరగాయాల పెంపకం జరగాలె. వచ్చే వానకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. రాబోయే రెండు సంవత్సరాలలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయి కోటీ ఎకరాలకు పైగా సాగునీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలె అని సిఎం అన్నారు.
‘ఎటువంటి రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్‌ చేస్తే దాని ధర పెరుగుతుంది. ఉదాహరణకు మిరపకాయ నుంచి కారంపొడి లేదా పసుపు కొమ్ముల నుంచి పసుపు తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు కొనాలన్నా కల్తీ అవుతుంది. మనం గనుక మార్కెట్‌లో ఒక బ్రాండ్‌ నేమ్‌ మన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు అదీ ప్రభుత్వ పరంగా తయారైన వస్తువన్న నమ్మకం కలిగించాలె. దీనికోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రారంభించాలె. మన ఆలోచనలను కార్యరూపంలో తీసుకుని వచ్చి అమలు పరచాలె. ఏ ప్రాంతంలో ఎన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఏ రకమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలో నిర్ణయించాలె. మన రాష్ట్ర అవసరాలకు సరిపోను మిగిలినవి పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలె. ఈ యావత్‌ ప్రక్రియలో ఐకెపి-మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి. ఏ మేరకు వీరిని భాగస్వాములను చేయవచ్చో అధ్యయనం చేయాలి. 130 కోట్ల ప్రజలున్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్‌. ఏ రాష్ట్రంలో ఏది పండదో దాన్ని విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులను అనుకూలంగా వాటిని పండించగలగాలె. తద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను తయారు చేయాలె. దేశ విదేశాల్లో అత్యుత్తమమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే విషయం అధ్యయనం చేయాలె అని సిఎం చెప్పారు.
‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలవాలె. మంచి మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలె. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తదనుగుణమైన పరిశోధనలు జరగాలె. అంతర్జాతీయ విపణిలో మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించటానికి ప్రయత్నం జరగాలె. ప్రతి గ్రామం ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలె. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు-పట్టణాలకు సరఫరా చేయాలె అని సిఎం అన్నారు.
రాష్ట్ర అర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, గత నాలుగు సంవత్సరాల్లో సగటున 17.17శాతం వృద్దిరేటును సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్దిరేటు ఉందని, జీఎస్టీపిలో ప్రథమ స్థానంలో ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు.వచ్చే ఆయిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాల మన పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయని,అందుకే మూస పద్దతిలో ఆలోచించకుండా నూతన వరవడికి సిద్దం కావాలని ముఖ్య మంత్రి అన్నారు. ఈ సమావేశంలో జరిగిన చర్చల ప్రాతిపదికగా ఆలోచనలు పంచుకుని ఎలా ముందుకు పోవాలో నిర్ణయిం చాలని అధికారులను కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాటు పలువు రిని ఇందులో భాగస్వాములను చేయాలని సిఎం చెప్పారు. తొలుత ఒక ఆరేడు మండలాలను పైలట్‌ పద్దతిన తీసుకుని కార్యక్ర మం ప్రారంభించాలని ఈ తర్వాత పెద్ద ఎత్తున ప్రారంభించొచ్చని సిఎం చెప్పారు. ఈ రోజు జరిగిన సమీక్ష ఆధారంగా అధికా రులు వివిధ స్థాయిల్లో మేధోమదన కార్యక్రమాలను,వర్క్‌షాపులను నిర్వహించాలని సిఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో అమలు పరుస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయాలని,అలానే అంతర్జాతీయ స్థాయిలో జరుగు తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలని సిఎం సూచించారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదని,ఉత్తమ స్థాయి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన పూర్వ రంగంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అధ్యయనం చేసి రావొచ్చని సిఎం సూచించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు సంబంధించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 45 లక్షల మంది సభ్యులున్న 4 లక్షలకు పైగా ఐకెపి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం చెప్పారు. పంట కాలనీల ఏర్పాటు,విత్తన కంపెనీల నియ ంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేదం, విత్తనాలు విరివిగా అందుబాటులో ఉంచడం,అవసరమైన ఎరువులు,క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచడం జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. నాటు యంత్రాలు,కలుపు తీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,సిఎంఓ అధికారులు నర్సింగ్‌ రావు,భూపాల్‌రెడ్డి,స్మితాసభర్వాల్‌,డిజిపి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్‌శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, టిఎస్‌ఐఐసి చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, శాసన మండలి చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి,ఆనంద్‌,వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.