ప్రణాళికాబద్దంగా నీటిని వినియోగించాలి

AP CM Chandrababu in Teleconference
AP CM Chandrababu in Teleconference

ప్రణాళికాబద్దంగా నీటిని వినియోగించాలి 

‘నీరు-ప్రగతి’,వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

‘‘నీటిపట్ల పవిత్ర భావన ఉండాలి, నీటి వనరులను అపరిశుభ్రం చేయరాదు. ఈ స్ఫూర్తిని పెంచేందుకే ‘జలసిరికి హారతి’ కార్యక్రమం చేపట్టాం.  కొంత ఆలస్యంగా నైనా శ్రీశైలం జలాశయానికి నీళ్లు రావడం ఆశాజనకంగా ఉంది. రాయలసీమలో వర్షాలు పడటం రైతులకు ఉపశమనం ఇచ్చింది. ఇంకా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో సగంకూడా నిండలేదు. తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి,వేసిన పంటలు అన్నింటినీ కాపాడాలి. ప్రణాళికాబద్ధంగా నీటిని వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఎస్ ఆర్ బిసి గండి పూడ్చివేత పనులకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయని అధికారులు వివరించగా, దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ రోజు సాయంత్రానికల్లా గండి పూడ్చివేత పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
పేదరికం లేని, పరిశుభ్ర సమాజం ఏర్పాటే గాంధీజికి మన నివాళి:
‘‘పేదరికం తొలగిపోవాలి, పరిశుభ్రమైన సమాజం నెలకొనాలి, జాతిపిత గాంధీజికి మనం అర్పించే నివాళి అదేనని’’ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు 3 కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛతే సేవ, లక్ష గృహాల ప్రవేశం, రూ.2లక్షలు బీమా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్వచ్ఛత వల్ల ప్రజారోగ్యం ఇనుమడిస్తుందని, గృహ ప్రవేశం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతుందని, 50ఏళ్లలోపు సహజ మరణానికి రూ.30వేల నుంచి రూ.2 లక్షలకు బీమా పరిహారం పెంచడం వల్ల సదరు కుటుంబసభ్యులకు అండగా ఉంటుందని చెప్పారు.
విజయదశమి సందర్భంగా కనక దుర్గమ్మను కోరింది మూడే కోరికలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1)స్వచ్ఛతే సేవ 2)నీటి భద్రత 3)విద్యుత్ భద్రత సంకల్పాలు తీసుకున్నట్లుగా వివరించారు. ఈ మూడింటిని నూరుశాతం సాధిస్తే రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అమరావతి,పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లుగా పేర్కొంటూ, వీటిని పూర్తిచేస్తే రాష్ట్రం అన్నింటిలో ముందజలో ఉంటుందన్నారు.
నవంబర్ లో విశాఖలో అంతర్జాతీయ రైతుసదస్సు:
నవంబర్ 15,16,17 తేదీలలో విశాఖలో అంతర్జాతీయ రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.మేలైన సాగువిధానాలు, అధిక ఉత్పాదనకు మెరుగైన పద్ధతుల గురించి సదస్సులో చర్చించనున్నట్లు వివరించారు.ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కలిగిస్తారని చెప్పారు. బిల్ గేట్స్ తో పాటు ప్రపంచ ప్రసిద్దిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారని ప్రకటించారు. ఇప్పటికే మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో డిజిటల్ సాయిల్ టెస్టింగ్ కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న విషయం గుర్తుచేశారు.దీనివల్ల భూసారలోపం గుర్తించి ఏయే ఎరువులు,సూక్ష్మ పోషకాలను వినియోగించాలో రైతులకు తెలియజేయవచ్చన్నారు. ఖరీఫ్ పంటల ఉత్పాదకత ఎంత ఉంటుందో అంచనాలు వేయాలని ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన శాఖ,మత్స్య శాఖల ప్రగతిని సమీక్షించారు. రాయల సీమ జిల్లాలకు ఇచ్చినట్లే ప్రకాశం జిల్లా రైతులకు కూడా మైక్రో ఇరిగేషన్ లో రాయితీని అందించాలని విజ్ఞప్తిచేశారు.
నరేగా నిధులు రూ.680కోట్లు వ్యయం చేయాలి:
అందుబాటులో ఉన్న నరేగా నిధులు రూ.680కోట్లు ఖర్చుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లేబర్ బడ్జెట్ రూ.16కోట్ల నుంచి రూ.20కోట్లకు పెరిగిందన్నారు. అన్ని జిల్లాలలో లేబర్ బడ్జెట్ పెంచుకోవాలని సూచించారు. నరేగా పనుల్లో చిత్తూరు జిల్లా ముందంజలో ఉండటాన్ని అభినందించారు,తూర్పుగోదావరి 2వ స్థానంలో ఉందని, పశ్చిమగోదావరి, నెల్లూరు,ప్రకాశం 3వ స్థానంలో ఉన్నాయంటూ మిగిలిన  జిల్లాలు కూడా మరింత పురోగతిని సాధించాలన్నారు.  అంగన్ వాడి భవనాలు,సిమెంట్ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
‘‘స్వచ్ఛతే సేవ కార్యక్రమాలలో విద్యార్ధులు,డ్వాక్రా మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలి, ప్రజలను చైతన్యపరచాలి. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత నెలకొనాలి,పచ్చదనం పెరగాలి. మార్చి31కల్లా ఆంధ్రప్రదేశ్ బహిరంగ విసర్జన లేని రాష్ట్రంగా రూపొందాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయం,అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి, జలవనరులు,ఆర్ధిక శాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్,చిరంజీవి చౌదరి, రాంశంకర్ నాయక్,హరి జవహర్ లాల్,రామాంజనేయులు,వెంకటేశ్వర రావు, సునీత, సెర్ఫ్,రైతుబజార్ సీఈవోలు కృష్ణమోహన్,రమణమూర్తి, వివిధ జిల్లాల కలెక్టర్లు,ప్రజా ప్రతినిధులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.