ప్రజా సంకల్ప యాత్ర మహోద్యమంగా మారింది

vasireddy PADMA
vasireddy PADMA

వైఎస్సార్సీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌: వైఎస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మహోద్యమంగా మారిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్సీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్ర ఏపి భవిష్యత్తును మార్చనుందని ధీమా వ్యక్తంచేశారు. ఏపికి 2019 సంవత్సరం చారిత్రాత్మక సంవత్సరంగా మారనుందన్నారు. ప్రజలు స్వర్ణయుగంలోకి అడుగు పెట్టనున్నారన్నారని ఆమె వ్యాఖ్యానించారు. సంవత్సరం పాటు అంకుఠిత దీక్షతో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించారని గుర్తుచేశారు. తిమ్మిని బమ్మి చేయడంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆరితేరారని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ఎంఎల్‌ఏలను అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఐటి, సిబిఐ రాకూడదని చంద్రబాబు చెప్పడం దేనికి నిదర్శనం అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు రోజురోజుకి దిగజారుతునాన్రి పేర్కొన్నారు. అబద్దాలతో అధికార పీఠమెక్కిన చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెప్తారని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు ఎంతటికైన దిగజారుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకు కూడా చంద్రబాబు యత్నించారని ఆరోపించారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు బిజెపితో విడిపోయినట్లు నటిస్తున్నారని విమర్శించారు. టిడిపి కాంగ్రెస్‌తో జట్టు కట్టడం దిగజారుడు తనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంట గెలవలేక బయట రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవి చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని, వలసలు పెరిగిపోతున్నాయని అన్నారు.