ప్రజలకు దూరమవుతున్న ప్రభుత్వ వైద్యం

government medical service
government medical service


చట్టాలు, నిబంధనలకు సామాన్యులు లోకువ అయితే సమర్థులకు చట్టాలు,రూల్స్‌ లోకువ అంటారు. కొన్ని సంఘటనలు కొందరు పెద్దలు అనుసరిస్తున్న వైఖరి పరిశీలిస్తే ఈ మాటలు అక్షరసత్యాలనిపిస్తున్నాయి. జరుగుతున్న పొరపాట్లు, తప్పులు జరిగినవే మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో ఈ చట్టాలు, ఈ నిబంధనలు వీటని నియంత్రించలేవేమోననిపిస్తున్నది. పొరపాటు, తప్పు, నిర్లక్ష్యం లాంటి పదాలకు అందని విధంగా కొందరు వైద్యులు చేస్తున్న నిర్వాకంతో మొన్న రెండు నెలలు నిండని పసికందు ఒకరు కన్నుమూశారు. పదుల సంఖ్యలో ఆస్పతిపాలై మృత్యువ్ఞతోపోరాడి చివరి నిమిషంలో బయటపడ్డారు.

ఇంకా మరికొందరు అస్వస్థతోనే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇలా పొరపాటుగా వైద్యం అందించడం ఇది మొదటిసారి కాదు, చివరిదికూడా కాదు. అంతకుముందు అత్యంత ప్రతిష్టాకరమైన ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ చేసిన వైద్యులు రోగి శరీరంలోపల కత్తెరపెట్టి కుట్లువేశారు. దాదాపు పక్షం రోజులపాటు ఆ మహిళారోగి పడిన అవస్థలు అన్నీఇన్నీకావ్ఞ. చివరకు పరీక్షల మీద పరీక్షలు చేయించుకొన్న తర్వాత కడుపులో కత్తెర ఉన్నట్టు బయటపడింది. దీంతో మళ్లీ ఆపరేషన్‌ చేసి కత్తెర బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్యంపై అంతంత మాత్రం విశ్వాసం ఉన్న ప్రజలను ఇలాంటి సంఘటనలు మరింత దూరం చేస్తున్నాయి. నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.

అందుకే చాలా మంది ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రైవేట్‌ వైద్యంవైపే మొగ్గుచూపుతు న్నారు. ప్రభుత్వం ఎన్నివేల కోట్లరూపాయలు వెచ్చించినా ఉచితంగా వైద్యం చేస్తామని పదేపదే ప్రకటిస్తున్నా తలతాకట్టుపెట్టి అప్పోసొప్పో చేసి అయినా ప్రైవేట్‌ దావఖానాలకు వెళ్లాలనే ఆరాటపడుతున్నారు తప్ప ప్రభుత్వ వైద్యంవైపు చూడటం లేదు. ఆర్థికవసతి లేనివారు మరో అవకాశం లేక విధిలేని పరిస్థితిలోనే ప్రభుత్వ ఆస్పత్రుల మెట్లు ఎక్కుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం లేకపోవ డం అనేది అందరికీ తెలిసిన విషయమే. గత ఐదారు దశాబ్దాలుగా ఇది కొనసాగుతున్నా ఇటీవల ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం పెంచి వారిని ప్రభుత్వ ఆస్పత్రులవైపు అడుగులు వేసేం దుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఇందుకోసం పెద్దఎత్తునే నిధులు ఖర్చుచేస్తుంది. డాక్టర్లను నియమిస్తున్నారు. మందులు సరఫరా చేస్తున్నారు. అయినా ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. వైద్యచికిత్స ఎలా ఉన్నా కొందరు ప్రభుత్వ వైద్య సిబ్బంది వివరిస్తున్న తీరు, నిర్లక్ష్యం ప్రజలను మరింత దూరం నెడుతున్నది. మొన్న జరిగిన రెండు సంఘటనలు కూడా అదే కోవలోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పు డు పటిష్టమైన చర్యలు తీసుకొని పునరావృతంకాకుండా చేయాల్సిన పాలక పెద్దలు విచారణల పేరుతో కాలం గడుపుతున్నారు. రెండు సంఘటనల్లో కూడా తెలంగాణ వైద్యశాఖమత్రి విచారణకు ఆదేశించారు. కమిటీలువేశారు. ఆ కమిటీలు నివేదిక ఇచ్చిన తర్వాత పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించా రు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కమిటీలు వేశారు, కమిటీలు నివేదికలు ఇచ్చాయి, చర్యలు ఏమి తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఈ సంఘటనలపై కూడా చర్యలు తీసుకుంటారనే నమ్మకాలు ప్రజల్లో లేవ్ఞ. విశ్వాసం సన్నగిల్లినప్పుడు కన్నుకు కన్ను, కాలుకు కాలు అనే అటవికన్యాయం గుర్తుకువస్తుంది. ఈ కారణంగానే డాక్టర్లపై కూడా ఆగ్రహావేశాలతో ఉన్న రోగి బంధువ్ఞలు దాడులకు తెగబడుతున్నారు. విచక్షణ కోల్పోయి ఆస్పత్రుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. సమర్థనీయం కాదు. కాని ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే. అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు డాక్టర్లకు పటి ష్టమైన రక్షణకల్పిస్తూ చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత పాలకులపై ఉంది.

అది విస్మరిస్తున్నారేమోననిపి స్తున్నది. ఇక వాతావరణంలో మార్పులు సంభవించిన ప్పుడల్లా రకరకాల వ్యాధులు ప్రజారోగ్యంపై దాడి చేస్తూనే ఉన్నాయి.ఎన్ని ఆస్పత్రులు నిర్మించినా సిబ్బంది సంఖ్యను ఎంత పెంచినా, ఎన్నివేల కోట్లు వెచ్చించినా ఈ వ్యాధి అదుపు చేయడంలో పాలక పెద్దలు విఫలమ వ్ఞతూనే ఉన్నారు. ఉన్నతస్థాయిలో అవగాహన లోపం, ఆశ్రితపక్షపాతం, అవినీతి, నిర్లక్ష్యం, అసమర్థతకారణంగా ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. గ్రామాల్లో వచ్చీరాని వైద్యంతో డాక్టర్లుగా చెలామణి అవ్ఞతూ తోచిన మందులు ఇస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అటెండర్లుగా, వార్డుబా§్‌ులుగా పనిచేసిన వారు గ్రామాల్లో డాక్టర్లుగా బోర్డు పెట్టుకొని వైద్యులుగా చెలామణి అవ్ఞతున్నారు. కనీసం మందుల పేర్లు కూడా రాయలేనివారు ఈ డాక్టర్ల జాబితాలో చేరిపోతున్నారు. అర్హతలేని ఇలాంటి వైద్యులు చేసే చికిత్సతో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నా రు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో విడుదల చేసిన నివేదిక ప్రకారం అల్లోపతి వైద్యం చేసేవారిలో 57శాతా నికి పైగా ఎటువంటి విద్యార్హతలు లేవనే విషయం బయ టపడింది. అలాగే వైద్యులుగా చెలామణి అవ్ఞతున్నవారి లో 18.8శాతం మంది మాత్రమే అర్హత ఉన్నట్లు వెలుగు చూసింది. అయినా ఇలాంటి వచ్చీరాని వైద్యంచేస్తున్న అర్హతలేని వైద్యులు దగ్గరికే వెళ్లి చికిత్స చేయించుకు నేందుకు ఇష్టపడుతున్నారు తప్ప అర్హత ఉండి కొద్దో గొప్పో వసతులు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల మెట్లు ఎక్కడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా పాలకపెద్దలు ఆలోచించాలి. ముందుగా నిర్లక్ష్యంగా, అసమర్థతతో తప్పులు, పొరపాట్లు చేస్తూ ప్రాణాలముప్పుకు కారకులైన వారిపై పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచేందుకు మరింత కృషి జరగాలి.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌ , హైదరాబాద్‌