‘పోల‌వ‌రం’కు కేంద్రం నుంచి పూర్తి స‌హకారంః గ‌డ్క‌రీ

Chandrabaunaidu & Nithin Gadkari
Chandrabaunaidu & Nithin Gadkari

ఢిల్లీః పోలవరం ప్రాజెక్టును తప్పకుండా 2019 నాటికి పూర్తి చేయడానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబకు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు రూ.381 కోట్లు విడుదల చేయడానికి తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు గడ్కరీ సీఎంకు చెప్పారు. కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పోలవరం వివాదంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టుపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో గడ్కరీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినందున దక్షిణ కొరియా బూసాన్‌ నుంచి ఫోన్‌ చేసిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు. ఇదే విషయంపై గడ్కరీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి తన కొరియా పర్యటనకు ముందే ప్రయత్నించగా. ఆయన లండన్‌ పర్యటనలో ఉన్నందున సాధ్యపడలేదు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.2,800 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చిన గడ్కరీ, ఈ రోజు కొందరు కాంగ్రెస్‌ నేతలు పోలవరం విషయంలో తనను కలిస్తే వారితో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు గడ్క‌రీ తెలిపారు.