పోలీసుల దౌష్ట్యాలు ఇంకా ఎంతకాలం!

url
url


పో లీసులు ఉద్యమకారుల స్థాయిని బట్టి హింసను ప్రయోగిస్తారు. ఉద్యమకారుల రాజకీయ, సామాజిక హోదాను బట్టి హింసా రూపాలు అమలు పరుస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆందోళనలో రోడెక్కితే సెల్యూట్‌ కొట్టి సవినయంగా మసలుకుంటారు. అట్టడుగు వర్గాల వారు ఆందోళన చేపడితే క్రూరంగా అణచివేస్తారు. పోలీసుల ఉత్కృష్టహింసా రూపం ఉద్యమకారులను తుపాకులతో కాల్చి చంపేయడం, ఎన్‌కౌంటర్లు చేయడం అతిచిన్న స్థాయి హింసా రూపం ఉద్యమిస్తున్న ప్రజలను గిచ్చడం, గిల్లడం, రక్కడం, పిన్నులతో గీరడం చేస్తారు. అదే బడా రాజకీయ నాయకులను నలుగురు కల్సిహుందాగా వాహనం వరకు మోసుకుపోతారు. ప్రత్యామ్నాయ ఉద్యమకారులను కడుపుకాలె కార్మికులను రోడ్డు మీద బరబరా ఈడ్చుకుపోతారు. బూటుకాళ్లతో కడుపులో తన్నుతారు. అదే ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులను సార్‌ ఇక విరమించడని బతిమాలుకుంటారు. ప్రత్యామ్నాయ ఉద్యమకారులను మీరు విరమించకుంటే వేసేస్తామంటారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తారు. హింసలో కూడా వివక్ష గోచరిస్తుంది. ఉద్యమకారులను, నిందితులను పోలీసు స్టేషన్‌లో బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేస్తారు. లాకప్పులో తలకిందులుగా వేలాడదీయడం, వేడినీళ్లలో నిలబెట్టడం, గోళ్లు పీకేయడం, థర్డ్‌డిగ్రీ హింసలకు గురి చేస్తారు. అంతటితో ఆగక కొట్టికొట్టి చంపుతారు. ఎదుటి వ్యక్తికి చిన్న గాయమైతేనే అయ్యోపాపం అంటాం. అలాంటిది పోలీసులు మానవత్వం మరచి మనుషుల్ని గాయపరచడం డ్యూటీగా భావిస్తున్నారు. ఇదంతా చట్టవిరుద్ధం. శిక్షార్హం. పోలీసులకు ఏ చట్టం అధికారం ఇవ్వలేదు. చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ ఆయుర్వేద కళాశాల వైద్యవిద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆయూష్‌ డైరెక్టర్‌ వర్షిణిని అడ్డుకొని ఘోరావ్‌ చేశారు. ఆందోళన చేస్తున్నవారు బాధ్యతాయుతమైన వైద్యవిద్యార్థులు కనుక ప్రశాంతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పలేదు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడలేదు. అయినా పోలీసులు క్షణాల్లో వాలిపోయారు. ఏ ప్రజాస్వామిక ఆందోళనైనా వారు చూసి భరించలేరు. వెంటనే అరెస్టులు మొదలు పెట్టారు. మమ్మల్ని వదిలేస్తే మేం వెళ్లిపోతాం మమ్మల్ని అరెస్టులు చేయకండని విద్యార్థినులు వేడుకుంటున్నా వినిపించుకోకుండా వారిని ఈడ్చుకుపోయి వాహనంలో ఎక్కించారు. ఇంతలో సివిల్‌ డ్రస్సులో ఉన్న చార్మినార్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ పరమేశ్వర్‌ రెచ్చిపోయి ఓ వైద్యవిద్యార్థినిని కాలితో తన్ని భుజం కిందిభాగాన గోళ్లతో గట్టిగా గిచ్చాడు. దీంతో ఆ విద్యార్థిని విలవిల్లాడుతూ ఒక్కసారిగా కేకలు వేసింది. ఇలాంటి చర్యలు విధుల్లో భాగమేనని పోలీసు ఉన్నతాధికారులు సమర్థించుకున్నారు. తర్వాత ఆ కానిస్టేబుల్‌ను విధుల నుండి సస్పెండు చేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ డిసెంబరు 27,2017 వరంగల్‌లో వరంగల్‌ డిక్లరేషన్‌కు 20 ఏళ్లు నిండిన సందర్భంగా ర్యాలీ, బహిరంగసభ నిర్వహించింది. దానికి ముందు ఆ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు కాళోజి సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించడానికి ప్రజాకళామండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి,తదితరులు చేరుకున్నారు. మహిళా సంఘం కార్యకర్తలు, విద్యార్థి సంఘం నాయకులు కూడా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వ్యాన్లు, జీపులు, వజ్రవాహనాలు, బంధించే తాళ్లతో రంగంలోనికి దిగారు. కళాకారులు కళాత్మక డ్రస్సుల్లో ఉండటం, పాటలు పాడుకుంటూ నివాళ్లు అర్పించడానికి వెళుతుండగా ఇద్దరు ఎసిపిలు, ఒక సిఐ కలిసి వారిని అడ్డుకున్నారు. నివాళ్లు అర్పించడానికి పర్మిషన్‌ లేదు కనుక స్థూపం వద్దకు వెళ్లడానికి వీలులేదన్నారు. అమరవీరుల మీద ఒక్కపాట పాడుతాం. స్థూపం దగ్గరికి వెళ్లనివ్వండని కళాకారులు బతిమాలుకున్నారు. ఇంతలో సాధారణ జనం పోగయ్యారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు అడుగు ముందుకు వేస్తే మిమ్మల్ని వేసేస్తాం అన్నారు. ఇంతలో ఎవరో ప్రజాస్వామిక తెలంగాణ వర్ధిల్లాలి అని నినాదం ఇచ్చారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకింతగనం కొడుతున్నారని ప్రశ్నించిన వారిని ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు. సివిల్‌ డ్రస్సులో ఉన్న పోలీసులు అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తించారు. మీరెవరని అడిగినందుకు గన్ను తీసి బెదిరించి ఎవరని అడుగుతారా? ఎన్‌కౌంటర్‌ చేసేస్తాం అని బెదిరించారు. మరోవైపు మహిళా సంఘం కార్యకర్తలను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ప్రజాసంఘాలు ప్రజల ఎడల చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ప్రతి కార్యక్రమంలో క్రమశిక్షణ పాటిస్తారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం కానీ, ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించడం కానీ చేపట్టరు. అలాంటిదేమైనా వ్ఞంటే చాలా తక్కువ సమయానికి పరిమితమై చేపడతారు. వచ్చిన చిక్కల్లా ప్రజాసంఘాల కార్యక్రమాన్ని ప్రభుత్వ సహించేస్థితిలో ఉండదు. వెంటనే పోలీసులను ఉసిగొలుపుతుంది. పోలీసులు ప్రభుత్వాలను మెప్పించడంలోనే మునిగిపోతారు. ఎంత క్రూరంగా అణచివేస్తే అంత ఎక్కువ మెప్పు పొందుతామని ఆశిస్తారు.ఉద్యమించే ప్రజల ను గిచ్చాలని, గిల్లాలని, అభ్యంతరకరంగా తాకాలని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలని ఏ సిలబస్‌ ప్రకారంగా వీళ్లకు శిక్షణ ఇస్తున్నారు? ఈ చర్యలకు చట్టబద్ధత ఉందా? ఈ తప్పుడు చర్యలకు శిక్షలుండ వా? ప్రభుత్వం అదుపు తప్పిన పోలీసులకు ఇంత ఇంప్యూనిటిని ఎందుకు కలుగచేస్తుంది. ఈ ఆధునిక సమాజంలో కూడా పోలీసులను సంస్కరించి సరైన బాటలో పెట్టలేమా? పోలీసులు మారకపోతే రాళ్లగడ్డ ప్రజా తిరుగుబాటు పునరావృతంకాదా!