పోలీసుల‌ను ఆశ్ర‌యించిన టిడిపి స‌ర్పంచ్ హ‌రిణి

TTDP News
TDP

విజయవాడ: ఓ ప్రజాప్రతినిధి తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది. అందరికీ అండగా ఉండాల్సిన ఆమె పోలీస్‌స్టేషన్ మెట్లెక్కడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఓ మహిళా ప్రజాప్రతినిధికే అన్యాయం జరిగితే తమలాంటి వారి పరిస్థితి ఏంటని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్త జితేంద్ర రామకృష్ణ నుంచి ప్రాణహాని ఉందని తేలప్రోలు సర్పంచ్ హరిణికుమారి పోలీసులను ఆశ్రయించింది. హరిణి భర్త జితేంద్ర రామకృష్ణ తెలుగుయువత నాయకుడు. విజయవాడలోని హోటల్‌లో ఉంటూ భర్త ఇంటికి రావడంలేదని, కారణం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది నుంచి తనను వేధిస్తున్నారని ఆమె వాపోయింది. తనపై జరిగిన దాడి విషయంపై పోలీసులకు ఆధారాలతో తహా ఇచ్చింది. సర్పంచ్ ఒంటిపై ఉన్న గాయాలను మీడియాకు చూపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. హరిణి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు తన శరీరంపై ఉన్న గాయాలకు సంబంధించిన వీడియోను హరిణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు జితేంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీకి చెందిన రామకృష్ణ, భార్యను వేధించడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.