పోలాండ్ విద్యార్థులతో పవన్ కళ్యాణ్ భేటీ

Poland Students Met pawan
Poland Students Met pawan

హైదరాబాద్:  ప్రశాసన్‌నగర్ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్ రాయబారితో పాటు పోలాండ్ విద్యార్థులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రాజకీయాలు, సినిమాలపై పవన్ అభిప్రాయాలను వారు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన సినిమాల్లో మహిళల విద్య, భద్రతకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. చదువులో తాను ఫెయిల్ అయినట్లు తెలిపిన ఆయన బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ అయ్యేవాడినని చెప్పారు.

భారత్-పోలాండ్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ఓ సంఘటనను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భయభ్రాంతులకు గురైన అక్కడి కొంతమంది మహిళలు, పిల్లలు(640) నౌకాయానం ద్వారా భారత్‌కు విచ్చేశారు. కాగా అప్పటి ముంబై స్థానిక బ్రిటీష్ గవర్నర్ వారికి ఆశ్రయం కల్పించడానికి నిరాకరించారు. దీంతో నవానగర్‌కు చెందిన మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా వీరిని ఆహ్వానించి ఆశ్రయం కల్పించారు.

రాజా వారు తన సంస్థనంలో వారి జీవనశైలికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. అదేవిధంగా అక్కడి వాతావరణాన్ని తలపించేలా ఓ మినీ పోలాండ్‌నే ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా అనంతర కాలంలో పోలాండ్ ప్రభుత్వం మహారాజా సేవలను గుర్తుచేసుకుంటూ పోలాండ్‌లో రాజావారి పేరుమీదుగా ఓ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిపై ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ తాను అదే స్కూల్లో చదువుకున్నట్లు పేర్కొన్నారు.