పోచంప‌ల్లి ఇక్క‌త్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు

pochampally ikkat sarees
pochampally ikkat sarees

భూదాన్ పోచంప‌ల్లిః జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరలకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తుందని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ అన్నారు. ‘పోచంపల్లి శారీస్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ‘గ్లోబల్‌ శారీస్‌ హండ్రెడ్‌ ఫ్యాక్ట్‌’ సంస్థకు అధ్యక్షురాలైన తేజ్‌దీప్‌ కౌర్‌ నేతృత్వంలో 48 మంది ప్రతినిధుల బృందం శనివారం యాదాద్రి జిల్లాలోని పోచంపల్లిని సందర్శించింది. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కుతోపాటు పోచంపల్లి టై అండ్‌ డై అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అసోసియేషన్‌ దుకాణాల్లో వస్త్రాలు ఖరీదు చేశారు. జాతీయస్థాయిలో జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరలకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తేవడంతోపాటు చేనేత పరిశ్రమకు తమ వంతు చేయూతనిచ్చే లక్ష్యంతో తమ బృందం పర్యటనకు వచ్చిందని తేజ్‌దీప్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల తయారీ ప్రక్రియ, డిజైన్లను పరిశీలించారు.