పొగడ్తల మహారాజు!

నీతికథ

Neeti kadha
Neeti kadha

పొగడ్తల మహారాజు!

సిద్ధిపురి రాజ్యమును సదాశివ వర్మ మహారాజు పరిపాలిస్తుండేవాడు. పాలన అనుభవముగల వివేకానంద అతనికి మంత్రిగా ఉండేవాడు. అతడు మహారాజుకు సమయ, సందర్భానుసారంగా సలహాలిస్తూ పరిపాలన సజావ్ఞగా సాగిస్తుండేవాడు. ఒకరోజు సదాశివవర్మ దూరపు బంధువ్ఞ తన భార్యతో రాజభవనానికి వచ్చాడు. ఆత్మీయంగా మాట్లాడారు.

మీ లాంటి మహారాజు దొరకడము సిద్ధిపురి రాజ్య ప్రజల అదృష్టము. మీ లాంటి మహారాజు ఎక్కడ కూడా లేడు. మొదలైన మాటల పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు. సదాశివ వర్మ పొంగిపోయాడు. ఆ సంతోషములో మీకేమి కావాలో కోరుకోండి అన్నాడు. ఆ బంధువ్ఞ వినయముతో మా కుమారుడు మల్లికార్జునవర్మ తెలివిగలవాడు. అతడిని మీ మంత్రిగా నియమించుకోండి అని బతిమాలాడు. సదాశివ వర్మ పొగడ్తలకు లొంగి సరేనన్నాడు. మర్నాడు వివేకానందను పిలిపించాడు. వివేకానంద మంత్రి! మీకు వయసు మళ్లింది. ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి మీకు విశ్రాంతినిస్తున్నాను. మీ స్థానములో మా దూరపు బంధువ్ఞ మల్లికార్జునవర్మను మంత్రిగా నియమిస్తున్నాను అని సగర్వంగా చెప్పాడు.

వివేకానంద ఆశ్చర్యపోయాడు. మహారాజా! నాకు వయసు మీరినా ఆరోగ్యం బాగానే ఉంది. మానసికంగా కూడా బాగానే ఉంది. నేను మీ ఆదేశాన్ని పాటిస్తాను కాని కొత్త వ్యక్తిని మంత్రిగా నియమించే ముందు అతని సామర్ధ్యాన్ని, గుణగణాలను వేగుల ద్వారా విచారణ చేయించి తెలుసుకోవాలి కదా. ఇదంతా మీ బాగుకోసమే చెపుతున్నాను అన్నాడు. వివేకానంద కుళ్లుతో అలా అంటున్నాడనుకున్నాడు మహారాజు. పైగా కోపానికొచ్చాడు. మా బాగు గురించి మాకు బాగా తెలుసు. నువ్వీ రాజ్యాన్ని వదిలివెళ్లు మన్నాడు. వివేకానంద పక్క రాజ్యానికెళ్లి తలదాచుకున్నాడు.

మల్లికార్జునవర్మ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కొద్దిరోజులలో పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. సర్వసేనాధిపతిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సదాశివవర్మను గద్దెదించి తానే మహారాజు అవాలని పథకం వేశాడు. సర్వసేనాధిపతితో తన పథకం గురించి చెప్పి నేను సింహాసనమెక్కగానే నీకు మంత్రి పదవి ఇస్తాను అని ఆశపెట్టాడు. ఇద్దరూ కలసి కుట్రపన్నారు. అదంతా తెలుసుకున్న ఓ గూఢచారి ఆ సమాచారాన్ని మహారాజుకు చేరవేశాడు. సదాశివవర్మ మల్లికార్జున శర్మను పిలిచి గూఢచారి చెప్పినదంతా చెప్పి. ఇది నిజమేనా? అని అడిగాడు. మల్లికార్జునవర్మ అతివినయముగా నమస్కరించి ఎంత మాట మహారాజా! నేను మీ బంధువ్ఞను, శ్రేయోభాలాషిని.

అదంతా అబద్ధం. ఆ గూఢచారి మాజీమంత్రి వివేకానందకు సన్నిహితుడు. నన్ను తొలగించి మళ్లీ అతనికే మంత్రి పదవి రావాలని కుట్రపన్నినట్టుంది అన్నాడు. అది మహారాజు గుడ్డిగా నమ్మాడు. మల్లికార్జున వర్మ పథకములో భాగంగా సదాశివవర్మ భార్య, పిల్లల్ని దొంగచాటుగా చంపించాడు. దుఃఖిస్తున్న మహారాజుకు సానుభూతి మాటలు చెప్పాడు. మహారాజు దుఃఖము నుండి తేరుకోలేదు. అదే అదనుగా భావించి సర్వసేనాధిపతి, మంత్రి కలిసి అర్ధరాత్రి మహారాజును బంధించారు. మర్నాడే మల్లికార్జునవర్మ మహారాజుగా సింహాసనమెక్కాడు.

ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సర్వసేనాధిపతిని చంపించాడు. సదాశివర్మను చెరసాలలో ఉంచితే ప్రజలు తిరగబడతారని గ్రహించాడు. అదేరోజు రాత్రి సదాశివవర్మను విడుదల చేసి దేశాన్ని విడిచి పారిపొమ్మన్నాడు. తెల్లవారి రాజ్యములో కనబడితే చంపేస్తానన్నాడు. సదాశివవర్మ వివేకానంద వద్దకెళ్లాడు. మల్లికార్జునుని దురాగతాలను చెప్పి అతని మాటలను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. వివేకానంద దయతలచి సదాశివవర్మను తనతోనే ఉంచుకున్నాడు. పక్క రాజ్యం రాజు సహకారంతో సదాశివవర్మ, మంత్రి కలిసి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని మల్లిరార్జునుని చెరసాలలో బంధించి, పరిపాలన సాగించారు.

 – ఐతాచంద్రయ్య, సిద్ధిపేట, మెదక్‌ జిల్లా