పైసలస్వామ్యంగా మారుతున్న ప్రజాస్వామ్యం!

ఒక్క మాట

(ప్రతి శనివారం)

Money Politics
Money Politics

పైసలస్వామ్యంగా మారుతున్న ప్రజాస్వామ్యం!

ప్రజాసేవ పేరుతో వ్యాపారాలు చేసేవారు కొందరైతే లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు తాము పెట్టిన పెట్టుబడికి మూడింతలు, నాల్గింతలు అదనంగా సంపాదించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్ఞతున్నారు. అడ్డదారులే రాజమార్గాలైపోతున్నాయి. ఏమి చేసైనా, ఎలాగైనా పదవ్ఞలు దక్కించుకోవాలనే ఆరాటంలో చేయకూడదని, చేయరాని పనులకు తెగబడుతున్నారు. ఇందులో లక్ష్మీపుత్రులు, అంగబలం ఉన్నవారే పోటీలో నిలబడగలుగుతున్నారు. రాజకీయమే జీవన సరళిగా జీవనం సాగించిన కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాసేవకే అర్థం మారిపోతుంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. ధధర్మాధర్మాలు తెలియవని కాదు. ఒకటి ఒంటబట్టడం లేదు. మరొకటి వదిలిపెట్టడం లేదు అన్నట్టుగా ఉన్నది రాజకీయ నాయకుల పరిస్థితి.

ఎన్నికల్లో నిబంధనలు పరిమితికి మించి ఖర్చుపెట్టరాదని, ప్రధానంగా డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభ పెట్టరాదని స్పష్టంగా తెలుసు. కానీ అవిలేకుండా ఎన్నికల్లో విజయం సాధించలేమనే వాస్తవం కూడా వారికి తెలుసు.అందుకే ఎన్ని అక్రమాలకుపాల్పడి అయినా, మరెన్ని అడ్డదారులు తొక్కి అయినా విజయాన్ని సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తు న్నారు. ఇందులో ఆ పార్టీ, ఈపార్టీ అనిలేదు. ఎవరి శక్తిమేరకు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిబంధనలను తుంగలోతొక్కి డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు. మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలకు మరో రెండువారాలు గడువ్ఞ ఉండగనే ప్రచార సెగలు గ్రామాల ను చుట్టుముట్టాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని మార్గాల ను అవలంభిస్తున్నారు. ఆపదమొక్కులు మొక్కుతున్నారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న డబ్బు, ఏరులైపారుతున్న మద్యం, ముఖ్యంగా కొందరు అభ్యర్థులు పెడుతున్న వ్యయం ప్రజా స్వామ్యవాదులనే విస్మయం కలిగిస్తున్నది.

దాదాపు ప్రతి నియోజకవర్గంలో కనిష్టంగా పదికోట్ల రూపాయలు తక్కువ కాకుండా మొదలైన వ్యయం వంద కోట్లకు చేరుకునే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులే అంచనా వేస్తున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా? పైసల స్వామ్యమా? అనే అనుమానాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ఒకపక్క కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నా మరొకపక్క జంకుబొంకు లేకుండా నిరాటం కంగా ఈ పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మొన్న గురువారం ఉపసంహరణల నాడు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్తున్నారు.

బుజ్జగింపుల పర్వంలోనే పది,పదిహేను కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థులున్నారని కూడా వార్తలు వెలువడు తున్నాయి. ఎన్నికల సంఘం ఎన్ని హెచ్చరికలు చేసినా, మరొక పక్క ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్దఎత్తున మద్యం, డబ్బు స్వాధీనం చేసుకొని కేసులు పెట్టి, అరెస్టు చేస్తున్నా ఇవేమీ ఆగడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనభై కోట్ల రూపాయల వరకు డబ్బు పట్టుబడగా వేలాది లీటర్ల మద్యం పోలీసు అధికారులకు చిక్కింది.అయినా పోలీసులన్నా, ఈ చట్టాలన్నా ఏమాత్రం భయ భక్తులు లేకుండాపోతున్నాయి. అందుకు చట్టాల్లోని లొసుగులు కొందరు అవినీతి అధికారుల చేతివాటమే కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతూనే ఉన్నది. కేసులు నమోదు అవ్ఞతూనే ఉన్నాయి. కానీ శిక్షలు వేయించడంలో దర్యాప్తు అధికారులు ఘోరంగా విఫలమవ్ఞ తున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1649 కేసులు నమోదుకాగా,అందులో శిక్షపడింది కేవలంనాలుగువందల ముప్ఫైఐదు మాత్రమే. వీటిలో కూడా కొన్ని పైకోర్టులకు అప్పీలు చేయడంతో నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇక న్యాయవిచారణలో ఉన్న నాలుగువందల ఎనభై కాగా, దర్యాప్తు దశలోనే ఇంకా కొనసాగుతున్నవి ఆరువందల ముప్ఫైతొమ్మిది. నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇంకా దర్యాప్తు దశలో ఉన్నాయంటే ఏమనుకోవాలి? ఎవరిని నిందించాలి? ఇక గత ఎన్నికల్లో డెబ్భై ఆరుకోట్ల రూపాయలు నగదు పట్టుబడగా వాటిలో సంబంధిత డాక్యూమెంట్లు చూపించడంతో నలభైతొమ్మిది కోట్లు వెనక్కి ఇచ్చేశారు. మిగతా డబ్బు ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించింది. అంటే చర్యలు తీసుకున్నది పదిశాతం కూడా లేదని చెప్పొచ్చు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు ఇవ్వడం ఆశచూప డం, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్‌171/బి 171 ఇ ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష వేయాలి.

ఇక వివిధ మతాలు, ప్రాంతాలు, కులాల జాతుల మధ్య వైష్యమాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసినా కరపత్రాలు పంపిణీ చేసినా ఐపిసి సెక్షన్‌ 505 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి పాల్పడితే ఐపిసి సెక్షన్‌ 332, 333,353 ప్రకారం పదేళ్లు జైలుశిక్ష. ఇక ఎన్నికలలో ఓటర్లను తరలించేందుకు ఎవరైనా ఉచిత వాహనాలు సమకూరిస్తే సెక్షన్‌ 127 ప్రకారం ఆరునెలలు జైలుశిక్ష. ఇలా చట్టంలో ఎన్నో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వాటిని ఏమాత్రం పాటిస్తున్నారు?

సభలు నిర్వహించాలంటే లక్షల్లో ఖర్చుపెట్టాల్సిందే.రోజూవారి కూలి చెల్లించి బీరు,బిర్యాని ఇస్లే తప్ప కదలిరావడంలేదు.అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.ఇలా నిబంధనలకు వ్యతి రేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఏమేరకు చర్యలు తీసుకుంటు న్నారో పరిశీలిస్తే ఎలక్షన్‌ కమిషన్‌ సామర్థ్యం చెప్పకనే చెబుతు న్నది. అందుకే ఈ డబ్బు, మద్యం పంపిణీ ఏడాదికేడాది పెరిగి పోతున్నది. ఒక్క తెలంగాణా లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఇదే పరిస్థితి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ముప్ఫైఐదువేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికార అంచనాలే చెబుతున్నాయి. దేశంలోని నాలుగువేల నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాదాపు పదిహేనువేల కోట్లకుపైగా వెచ్చించినట్లు అనధికార అంచనా. అలాగే ఎన్నికల్లో ఇలా పెట్టు బడి పెట్టి తిరిగి సంపాదించుకోవడంలో కూడా కొందరు నేతలు పోటీపడుతున్నారు. అందుకే కొందరు రాజకీయనాయకులు ఆస్తులు అంచనాలకు మించి ఊహకందకుండా వందలాదిరెట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా ఎన్నికల ప్రక్రియే ఒక మిధ్యగా మారిపోతున్నదని ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలు ప్రాణం వంటివి.

రానురాను అవి ఖరీదైన వ్యాపారంగా మారిపోయాయి. సంపన్నుల గుత్తసొత్తుగా రూపాం తరం చెందాయి. ఓట్లుకు వెలకట్టిఇచ్చే దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల కమిషనే ఊపిరి. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా రాగద్వేషాలకు అతీతంగా స్వతంత్ర ప్రతిపత్తి హోదాతో దేశంలోని చట్టసభలకు ఎన్నికలను నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో ఏకసభ్య కమిషన్‌ ఏర్పడిన ఎన్నికల సంఘం ఆ తర్వాత త్రిసభ్య కమిషన్‌గా రూపాంతరం చెందింది. ఒకే వ్యక్తి చేతిలో అంతటి కీలకమైన సంఘం అధికారం ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో చట్టాన్ని సవరించి త్రిసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారం ఎలా చేయాలి? ఎంత ఖర్చు పెట్టాలి? సభలు, సమావేశాలు ఏ సమయం వరకు నిర్వహించుకోవాలి? ఎన్ని వాహనాలు వాడాలి? తదితర విష యాలు స్పష్టమైన నిబంధనలతో ఎన్నికల నియమావళిని నియమించి రూపొందించారు. ఇంత పకడ్బందీ నియమావళి ఉందన్న విషయం చాలాకాలం వరకు దేశంలో అధిక శాతం ప్రజలకు తెలియదు.

కానీ చంద్రశేఖర్‌ ప్రధాన మంత్రిగా ఉన్న ప్పుడు ఎన్నికల కమిషనర్‌గా శేషన్‌ నియామకం జరిగిన తర్వాత కమిషన్‌కు ఎక్కడలేని గుర్తింపు, ప్రాముఖ్యత వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల కమిషన్‌ అంటూ ఒకటి ఉందని, దానికి నియమావళి ఉందనే విషయం సాధారణ పౌరులకు శేషన్‌ కాలంలోనే తెలిసిందని చెప్పొచ్చు. రాజకీయ ఒత్తిడులకు లొంగ కుండా, నీతినిజాయితీతో నిర్బయంగా వ్యవహరిస్తే ఉన్న చట్టాల తోనే ఎంతవరకు చేయవచ్చునో ఆయన మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించారు. ఒకరిని ఆశ్రయించే స్వభావం, వ్యసనాలు, వ్యక్తిగత బలహీనతలు ఆయనకు లేనికారణంగా ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగలేదు.

కొమ్ములు తిరిగిన నాయకులకు కూడా చెమటలు పట్టించారు. కొందరునాయకులకైతే పగటిపూటే కలలు తెప్పిం చారు. కరెంటు స్తంభాలకు జెండాలు కట్టాలన్నా, గోడమీద రాయాలన్నా, వెనకాముందు ఆలోచించాల్సి వచ్చింది. ఏ తప్పుచేస్తే ఏమూల నుండి తమను కనిపెట్టి చర్యలకు ఒడిగడతా రననే భయం అభ్యర్థులతో పాటు వారిని బలపరుస్తున్న అనుచరుల్లో నెలకొనే పరిస్థితులు తీసుకువచ్చారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోకపోతే తమ పీటాల కిందకే నీళ్లు వస్తాయనే భయం అధికారుల్లో కూడా కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవడానికి ఇదే అధికారులు వెనుకాడలేదు.

అయితే శేషన్‌ తర్వాత కమిషన్‌ అంత తీవ్రస్థాయిలో వ్యవహ రించలేకపోయినా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా మరొకపక్క కొందరు రాజకీయ నేతల ఆగడాలు, అతిక్రమణలు అంతకంతకు పెరిగి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. ఏదిఏమైనా ప్రజాసేవ పేరుతో వ్యాపారాలు చేసేవారు కొందరు అయితే లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రజాప్రతి నిధులుగా ఎన్నికైనవారు తాము పెట్టిన పెట్టుబడికి మూడింతలు, నాల్గింతలు అదనంగా సంపాదించి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్ఞ తున్నారు. అడ్డదారులే రాజమార్గాలై పోతున్నాయి. ఏమి చేసి అయినా, ఎలాగైనా పదవ్ఞలు దక్కించుకోవాలనే ఆరాటంలో చేయకూడదని, చేయరాని పనులకు తెగబడుతున్నారు. ఇందులో లక్ష్మీపుత్రులు, అంగబలం ఉన్నవారే పోటీలో నిలబడగలుగు తున్నారు. రాజకీయమే జీవన సరళిగా జీవనం సాగించిన కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాసేవకే అర్థం మారిపోతుంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది.

– దామెర్ల సాయిబాబ