పేద‌రిక నిర్మూల‌న‌కు రుణ‌సాయం

China
China

బీజింగ్‌: పేదరిక నిర్మూలన కోసం చైనా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు దాదాపు 40 వేల కోట్ల యువాన్ల(6 వేల కోట్ల డాలర్ల) మేర రుణ సహాయం అందించేందుకు చైనా అభివృద్ధి బ్యాంకు (సిడిబి) ప్రణాళికలు సిద్ధం చేసింది. మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు పేదలను ఉపాధి లభ్యతా ప్రాంతాలకు తరలించటం, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, పేదలు నివశిస్తున్న ప్రాంతాలలో విద్యా, ఆరోగ్య అవకాశాలను అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాలకు ఈ రుణాలను వినియోగిస్తారని బ్యాంక్‌ ఒక ప్రకటనలో వివరించింది. గత ఐదేళ్ల కాలంలో దాదాపు 987 పేద దేశాలలో పేదరిక నిర్మూలనా కార్యక్రమాలకు 91,900 కోట్ల యువాన్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు బ్యాంకు ఈ ప్రకటనలో వివరించింది. 1994లో ఏర్పాటయిన సిడిబిని దేశంలో ప్రభుత్వం చేపట్టే ప్రధాన జాతీయ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందచేసే లక్ష్యంతో ప్రభుత్వం రూపకల్పన చేసింది. క్రమంగా ఈ బ్యాంకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థ గా అవతరించింది. ఈ ఏడాది చివరినాటికి దాదాపు కోటి మంది ప్రజలను పేదరికం నుండి వెలికి తీసుకురావాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2012-17 మధ్య కాలంలో దాదాపు 6.85 కోట్ల మంది ప్రజలకు చైనా ప్రభుత్వం పేదరికం నుండి విముక్తి కల్పించింది.