పేదరికం మంచిదే

Shirdi Saibaba
Shirdi Saibaba

పేదరికం మంచిదే

”దరిద్రం ఉత్తమమయిన దివ్యసామ్రాజ్యం. భాగ్యం కన్నా లక్షరెట్లు గొప్పది. పేదలకు భగవంతుడు సోదరుడు అంటారు సాయిబాబా. తమ కంటిచూపుతోనే మహారాజులను చేయగల సామర్థ్యం ఉన్నా బీదరికాన్నే కోరుకున్నాడు సాయిబాబా. అస్సీసీలో జన్మించిన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ తండ్రి ధనికుడైన వ్యాపారస్థుడు. ఫ్రాన్సిస్‌ అందగాడు. సుఖవిలాస వాతావరణంలో పుట్టి పెరిగాడు. దుఃఖాలకు, బాధలకు గురికాకుండా రాజభోగం అనుభవిస్తూ తన ఈడు యువత భోగుల మధ్య బ్రతికాడు. ”అమ్మా ధర్మం! అయ్యా ధర్మం! అంటూ ఒక బిచ్చగాడు ఇంటి ముందు నిలబడ్డాడు. ఫ్రాన్సిస్‌ జతగాండ్రందరూ బిచ్చగానిని కసిరారు. ఆ బిచ్చగాడు దీనాలాపం మానలేదు. ఆ దీనాలాపం ఫ్రాన్సిస్‌ హృదయాన్ని కదిలించి వేసింది.
తన జేబులో ఉన్న బంగారు నాణేలన్నీ బిచ్చగాని జోలెలో వేశాడు. ఇక బీదలు ఎక్కడ కనబడ్డా డబ్బులు ఇవ్వటం అతనికి పరిపాటి అయింది. తండ్రి కోపగించుకునేవాడు. ఒకనాడు ఆతనిని జీసస్‌ క్రైస్టు చర్చిని పునః నిర్మించుము అనే ఆదేశాన్నిచ్చారు. తండ్రి గుర్రాన్ని మొదలైన వాటిని, ఆ చర్చి ఉద్ధరణ కోసం వాడేవాడు. తండ్రికి నచ్చలేదు. అప్పటికప్పుడు ఫ్రాన్సిస్‌ తనవద్ద ఉన్న ధనాన్ని, ఆభరణాలను, కట్టుబట్టలతో సహా తండ్రికి ఇచ్చివేస్తూ ”నా తండ్రి క్రీస్తే అన్నాడు. ఇంటి నుండి వెళ్లిపోయాడు. బీదరికంలోనే, జీసస్‌ క్రైస్తువలె జీవనం సాగించాలని తీర్మానించుకున్నాడు. ఒక విలాసవంతుడు, అత్యంత కఠినమైన బీదరికంలో ఉండి బోధనలు చేయసాగాడు. ఆయన జీవించే పవిత్ర జీవనమే ఆదర్శము. గ్రామగ్రామాలు తిరిగి తనకు గలిగిన జ్ఞానాన్ని, భగవంతుని ప్రేమను తెలిపేవాడు. మొదట ఆతని స్నేహితులే నవ్వేవారు. బురద చల్లేవారు. అన్నీ సహనంతో అనుభవించాడు.

వినమ్రత, ఓర్మి, ప్రార్థనలను అందరికీ నేర్పేవాడు. ఒక కోటీశ్వరుడు ముగ్థుడై, తన సర్వస్వాన్ని ఫ్రాన్సిస్‌కు ఇచ్చివేశాడు. ఇలా ఎందరో ఆయనను గౌరవించారు. ఆయన అనుయాయులుగా మారారు. వారందరి కృషి బీదలకు సాయపడుట, మానవసేవ చేయుట ఊపిరిగా మారింది. జీవితాన్ని మానవసేవకే అంకితము చేయలేదు ఆయన. సర్వజీవ్ఞలు ఒకటేనని, అన్నింటిని ప్రేమించే సాధన ఆయన అందరకూ నేర్పించారు. ఈ పృధ్వీతలాన్ని అందలి పశు, వృక్షాలతో, పుష్పాదులను, మింటి సూర్యాది నక్షత్రరాసులను తిలకిస్తూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బ్రతకమని ఆయన సందేశం. జీవగణమంతా తన సోదరీ సోదరులని, అన్నింటికి భగవంతుడే తండ్రియని పూర్ణవిశ్వాసంతో ఆయన బ్రతికాడు. అలా బ్రతకాలని సందేశాలిచ్చేవాడు.

ఒకసారి ఆయన తన సోదర బృందంతో (అనుచరులతో) అడవిలో పోతున్నాడు. సోదర బృందం ముందుపోతోంది. అనేక చెట్లపై కూర్చుని తనవైపు చూస్తున్న పక్షులను చూశాడు. అక్కడే ఆగిపోయాడు. ఫ్రాన్సిస్‌ వాటికి బోధింపసాగాడు. ”మీరంతా భగవంతునికి కృతజ్ఞతతో ఉండాలి. మీరంతా ఎగరగలరు. పాడగలరు. సూర్యకాంతిని, వాయువ్ఞను ఆస్వాదించగలరు. భగవంతుడు మీ కొరకు నీరు, ఆహారము, ఏర్పరచియున్నాడు. ఆయనకు కృతజ్ఞత తెల్పండి అన్నాడు.

ఆయన బోధ అయిన తర్వాత ఆ పక్షులు నాలుగుదిక్కులా వెళ్లిపోయాయి సంతోషంగా. క్రూర జంతువ్ఞల కూడా ఆయన ప్రేమకు పాత్రమయినవే. సాయిబాబా సాహిత్యంలో ఒక వ్యాధిగ్రస్తుడు ఒంటినిండా కురుపులతో, చీముతో సాయి వద్దకు వస్తాడు. అతడిని చూచిన శ్రీమతి తారాబాయి ముఖం చిట్లించుకుని వీడెప్పుడు పోతాడా అన్నట్లున్నది. సాయి ఆమె మనస్సు గ్రహించాడు.

ఆ వ్యక్తి నుండి తీపి పదార్థాన్ని, తాను తిని తారాబాయికి కూడా తినమని ఇచ్చాడు. సాయి ఆజ్ఞ ఆమె పాటించింది. ఎవరిపట్ల అసహ్యం చూపరాదని సాయి తెలిపాడని ఆమె గ్రహించింది. ఇటువంటి సంఘటన ఫ్రాన్సిస్‌ జీవితంలో జరిగింది. కుష్టువ్యాధి పీడితులంటే అతనికి జుగుప్స. ఒకనాడు ఒక కుష్టురోగి ఎదురుపడ్డాడు. అప్పుడు ఫ్రాన్సిస్‌ కుష్టురోగిని కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నాడు. ఒకటి రెండడుగులు వేసి, వెనక్కు తిరిగి చూశాడు. ఆ కుష్టురోగి లేడు. ఆ రూపంలో వచ్చింది జీసస్‌ క్రైస్టు గాక వేరెవరు అయి ఉంటారు? దైవ పరీక్షలో ఫ్రాన్సిస్‌ నెగ్గాడు? సెయింట్‌ ఫ్రాన్సిస్‌ అయ్యాడు. ఆయన భౌతిక దేహాన్ని అక్టోబరు3, 1226న విడిచారు

– యం.పి. సాయినాథ్‌