పేదరికంపై ఆర్భాటమే తప్ప ఆచరణేది?

పేదరికంపై ఆర్భాటమే తప్ప ఆచరణేది?

poor people
poor people

ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించి సమసమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ఎంతో కృషి చేస్తున్నామని అందుకోసం దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు పాలకపెద్దలు పదేపదే చెప్పుకుంటున్నా ధనికులు మరింత లక్ష్మీపుత్రులుగా ఎదిగిపోతున్నారు. పేదలు మరింత నిరుపేదలుగా మారి దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ ఆకలి చావ్ఞలు చోటుచేసుకుంటున్నాయంటే ఎవరిని నిందించాలి? ఏమని చెప్పాలి? భారతదేశం మొత్తం సంపదలో యాభై ఎనిమిది శాతానికిపైగా కేవలం గుప్పెడు మంది చేతిలో చిక్కుకుపోయినట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అంతరాయం పెరిగిపోతున్నది. అయితే భారతదేశానికి సంబంధించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల సంఖ్యలో కొంత మార్పు కన్పిస్తున్నా చేపడుతున్న పథకాలు, వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధుల స్థాయిలో పేదల సంఖ్య తగ్గడం లేదు. అయితే పేదరికం నిర్మూలన విషయంలో చైనా, ఇండోనేషియా, వియత్నాం తదితర దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా వెనుకబడిపోయినట్లు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేదని ఆర్థికరంగ నిపుణులే అంగీకరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం పరిశీలించినా ఈ విషయం స్పష్టమవ్ఞతుంది. 1990 భారత్‌లో పేద సంఖ్య 33.8 కోట్లు ఉండగా అది 2013 నాటికి కేవలం 21.81 కోట్లకు తగ్గింది. అంటే 23ఏళ్లలో లక్షలాది కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత పేదల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన పిదప పన్నెండుకోట్లు మాత్రమే తగ్గించగలిగారు. ఇదే సమయంలో పొరుగునున్న చైనాలో నిరుపేదల సంఖ్య 75.6 కోట్ల నుండి 2.6 కోట్లకు తగ్గిపోయింది. ఇంకా అనేకదేశాల్లో పేదల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

అసలు ప్రపంచం మొత్తంలో పేదల్లో 30 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అన్నిటికంటే నేటికీ భారత్‌లో ఆకలిచావ్ఞలు చోటుచేసుకుంటున్నాయనే విషయం ఆవేదన కలిగిస్తున్నది. ఆహారభద్రతకు పాలకులే పూచీకత్తు ఇస్తున్న ఈ రోజుల్లో తిండిలేక ఆకలితో అల్లాడి ప్రాణాలు పోగోట్టుకున్న ఉదంతాలు ప్రజాస్వామ్యవాదులను కలిచివేస్తున్నాయి. 2015-18లో దేశవ్యాప్తంగా 56 మందికిపైగా ఆకలి అలమటిస్తూ ప్రాణాలు విడిచినట్లు అధికార లెక్కలే చెప్తున్నాయి.

ఈ నిర్భాగ్యుల్లో నలభైరెండు మంది గత రెండేళ్లలో చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లు ఆకలిచావ్ఞల్లో మొదటిస్థానంలో ఉన్నాయి. ఇక అర్థాకలితో అల్లాడు తున్నవారి సంఖ్య కోట్లల్లో ఉండవచ్చుననేది అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆకలి చావ్ఞల విషయంలో పాలకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్ఞతాయి. ఎవరు అధికారంలో ఉన్నా అవి ఆకలిచావ్ఞలు కాదనే స్పష్టం చేస్తూనే ఉంటారు. ఆకలితో నీరసించి నీరసించి అనారోగ్యానికి గురై ప్రాణాలు వదులుతున్నారు.

అధికార లెక్కల సంగతి అటుంచితే వాస్తవంగా ఇలా పోషక విలువలు లేని ఆహారం కూడా కడుపు నిండా తినడానికి నోచుకోకుండా బలహీనపడి వ్యాధులు సోకి మరణించే వారి సంఖ్య లెక్కపెడితే లక్షల్లో ఉండవచ్చుననేది అందరూ అంగీకరిస్తున్నదే. దీర్ఘకాలిక పస్తులతో ఒంట్లో రోగనిరోధకశక్తి తగ్గి అంటురోగాల బారినపడి మరణిస్తు న్నారనే విషయాన్ని వైద్యనిపుణులు కూడా అంగీకరిస్తు న్నారు. పేదరికమే వీటన్నింటికి మూలమనేది కాదనలేని వాస్తవం.

పేదరికంతోపాటు అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఐరోపా లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాలన్నింటిలోనూ అసమానతలు అంతకంతకు పెరుగుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1930లో ఆదాయపరంగా అత్యున్నతస్థాయిలో ఉన్న ఒక్క శాతం సంపన్నులు దేశప్రజల ఆదాయాన్ని 21 శాతం చేజిక్కించుకున్నారు. 1986 ఆరంభానికి ఆ వాటా ఆరు శాతం తగ్గినా మళ్లీ 2014 నాటికి 22 శాతానికి పెరిగింది. ప్రపంచంలో ఆదాయపరంగాఇంతపెద్దస్థాయిలో అసమానతలు ఉండటం భారత్‌ తర్వాత దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల్లోనే.

పేదరికనిర్మూలనకు పొరుగుదేశం అవలంభించి లక్ష్యాన్ని సాధిస్తున్న పద్ధతులు, విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో చైనా సాధించిన ప్రగతి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి. అన్నిటికంటే భారత్‌లాంటి దేశంలో వ్యవసాయాభివృద్ధి, గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతోపాటు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పన, మౌలిక వసతులతోపాటు మానవవనరుల అభివృద్ధికి చేపట్టిన పెట్టుబడులు లాంటి అంశాల్లో చైనా అనుసరించిన విధానాలను దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రధానంగా గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడంతోపాటు అటు ఉత్పత్తిరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు చేయూతనివ్వాల్సిన తరుణమిది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అవసరాలను, డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఆ కోణంలో యువకులకు శిక్షణ ఇచ్చి వ్యవసాయోత్పత్తి రంగంలోకి వారిని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తే అటు జీవనోపాధి, మరొకపక్క ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయి.

2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కించకుండా త్రికరణశుద్ధిగా కృషి చేయాలి. ఏదిఏమైనా పేదరిక నిర్మూలనకు అన్నికోణాల్లో పోరాటం చేయాల్సిన సమయమిది.
–  దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌