పెరుగుతున్న వైట్‌కాలర్‌ నేరాలు

               పెరుగుతున్న వైట్‌కాలర్‌ నేరాలు

white collar crimes
white collar crimes

ఎన్నిచట్టాలు చేసినా, మరెంత మంది అధికారులను నియమించినా పాలకులు ఎన్ని హెచ్చరికలు చేసినా వైట్‌కాలర్‌నేరాలు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా, ఎంత మందిని మోసం చేసినా లక్ష్మీపుత్రులుగా మారితే ఈ చట్టాలు, అధికారులు ఏమీ చేయలేరనే ధీమా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అంతేకాదు చట్టాల్లో ఉన్న లొసుగులు కూడా ఈ నేరస్తులకు ఎంతో ఉపయోగపడు తున్నాయి. వాస్తవంగా చూస్తే మన రాజ్యాంగ నిర్మాతలు కుల,మత,వర్గ, లింగ భేదాలు లేకుండా అందరికీ సమానంగా వర్తించేవిధంగా శాసనాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు. అవి నిష్పక్షపాతంగా అమలు చేస్తారని ఆశించారు.

కానీ అమలు చేయాల్సిన కొందరు అధికారులు, రాజకీయ ఒత్తిడులకు లొంగో లేక దక్షణలకు ప్రలోభపడో చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచు కుంటారని నాటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేక పోయారు. ఫలితంగా వందలాది కరుడుగట్టిన నేరస్తులు వంచించి వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్న వైట్‌కాలర్‌ నేరస్తులు తప్పించుకోగలుగు తున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు జరిపి పటిష్టమైనరికార్డులు తయారు చేసి, అవసరమైన సాక్ష్యాలను కోర్టుముందు నిలబెట్టి నేరాన్ని రుజువ్ఞచేయడంలో అధికారవర్గాలు కూడా విఫలమవ్ఞతున్నాయి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల దర్యాప్తు సక్రమంగా ముందుకు నడవకపోతే మరికొన్ని సందర్భాల్లో అధికారులే కేసు వీగిపోయేవిధంగా రికార్డులు తయారు చేస్తున్నారు.

ఇంకొన్ని సందర్భాల్లో అధికారులు సకల అవస్థలుపడి కోర్టుల ముందు రుజువ్ఞ లతో సర్వం సిద్ధం చేసినప్పుడు ప్రభుత్వమే ఏకంగా కేసులను ఉపసంహరిస్తుంది.ఇలాంటి ప్రభుత్వ చర్య సమర్థవంతంగా దర్యాప్తు చేసే అధికారుల్లో నిస్పృహ పెంచుతుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన సిఆర్‌పిసి, ఐపిసి నిబంధనలను కాలానుగుణంగా సవరించాలనే పోలీసు అధికారుల వాదన కూడా సమంజసమే. కానీ ఉన్న నిబంధనలను, చట్టాలను ఏమేరకు నిస్పక్షపాతంగా అమలు చేస్తున్నారన్నారన్నదే ప్రశ్న. ధనిక,పేద తేడాలు లేకుండా ఎంతవరకు చిత్తశుద్ధితో వ్యవహరించగలుగు తున్నారనేదే ముఖ్యం. ఏ అండాలేని నిరుపేదలు పోలీసు స్టేషన్‌కు వస్తే ఎలా వ్యవహరిస్తారు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు.

నేరస్తుల విషయంలో కూడా కొందరు అధికారులు ఉదాసీనవైఖరితో వ్యవహరిస్తున్నారనేది కూడా కాదనలేని వాస్తవం. అందుకే ఈ నేరాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇటీవల బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో దేశవిదేశాల్లో వందల కోట్లు స్వాహా చేసిన ‘హీరా గ్రూపు కంపెనీ అక్రమాలకు అడ్డులేకుండాపోయింది. హైదరాబాద్‌ పోలీసులు సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి దర్యాప్తు చేసే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దుబాయి, సౌదీ అరేబియా తదితర దేశాల్లో పెద్దఎత్తున సభ్యులను చేర్పించినట్లు కూడా పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇక భారత్‌లో హైదరాబాద్‌, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీలో ఈ కంపెనీ కార్యాలయాలు ప్రారంభించి పెద్దఎత్తునే చట్టఉల్లంఘనకు పాల్పడి అమాయకులను మోసం చేశారని పోలీసులు అభియోగం చేశారు.

ఇక ఫైనాన్స్‌ కంపెనీల గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అనేక భోగస్‌ ఫైనాన్స్‌కంపెనీలు పెట్టి లక్షలాది అమాయకుల కష్టార్జితాన్ని కోట్లల్లో కొల్లగొట్టి బోర్డులు తిప్పేస్తే జీవితకాలం పాటు సంపాదించుకున్న డబ్బు పోగొట్టుకున్నా న్యాయం చేసేవారు లేక బాధితుల వేదన అరణ్యరోదనగా మారి కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగేళ్లలో కనీసం దాదాపు పది,పన్నెండువేల కోట్ల రూపాయల వరకు ఇలా మోసం చేసినట్లు అనధికార అంచనా. ఇందులో రికవరీ మాట ఎలా ఉన్నా నిందితుల్లో పది శాతం మందిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. కొందరు ఎలాంటి భయం లేకుండా బాహాటంగానే తిరుగుతున్నారు.

ఇరవైఐదు లక్షల నుండి రెండువందల యాభై కోట్ల వరకు మోసం చేసిన ఫైనాన్స్‌కంపెనీల యాజమానులపై చర్యలు తీసుకోవడంలో నిందితులను పట్టుకొని న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఇక ఒకే ప్లాట్‌ను ఇద్దరు ముగ్గురికిఅమ్ముతూ వాయిదాల పద్ధతిపై అమాయకులను మోసం చేస్తున్న ఘరానా పెద్దలు కూడా ఎందరో ఉన్నారు. ఏదో రకంగా డబ్బు సంపాదించగలిగితే తమను ఎవరూ ఏమీ చేయలేరనే భావన రోజురోజుకు పెరిగిపోతున్నది. అందుకే ఒకరిని చూసి ఒకరు పోటీ పడి ప్రజలను మోసం చేసి కోటీశ్వరులు అయిపోతున్నారు.ఈ విషయాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లితే న్యాయం సంగతి ఎలా ఉన్నా అసలు కేసు నమోదు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

సివిల్‌ తగాదాలు అంటూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి కేసులు పెట్టి వసూలు చేసుకోమని సలహాలు ఇస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఏదైన కారణాలతో కేసు నమోదు చేయాల్సివస్తే సాక్ష్యాలు, ఆధారాలున్నాయా? లేవా? ఎందుకు నమ్మారు? రికార్డులు పరిశీలించి దర్యాప్తులో సంతృప్తిచెందితే కేసులునమోదు చేసి చర్యలు చేపడుతు న్నారు. ఇలాంటి ఫిర్యాదులన్నీ నమోదు చేస్తే పోలీసులు వేరే పనిచేయలేరనే వాదనను కూడా తోసిపుచ్చలేం. పెరిగిన నేరాలతోపాటు పోలీసులకు బాధ్యతులు కూడా పెరిగిపోయాయనేది కాదనలేని వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర పాలకులు ఈ వైట్‌కాలర్‌ నేరాల అదుపునకు పటిష్టమైన చట్టం, వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది.
– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌