పెద్ద సమస్యతో చిన్న సబ్బుల పరిశ్రమలు సతమతం

SOAP-
SOAP

పెద్ద సమస్యతో చిన్న సబ్బుల పరిశ్రమలు సతమతం

ముంబై,: చూడడానికి చిన్నదిగానే ఉంటుంది. చేతిలో ఇమిడిపోతుంది. స్నానం చేసినప్పుడు అరిగిపోతుంది. అయినా అందరూ అదే కావాలని అనుకుంటారు. ఇంతకి అదేమిటో తెలుసా? 10 రూపాయల సబ్బు. పేరుకు రూ.10లే కానీ, ఈ పరిశ్రమ వేల కోట్లలో ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సబ్బుల పరిశ్రమలో 10 రూపాయలకు ప్రతీ కంపెనీ ఒక సబ్బుని తయారీ చేసి విడుదలచేస్తోంది. అన్ని విభాగాల్లో కంటే ఈ విభాగంలో పోటీ ఎక్కువ. దానికి కారణం పల్లెల నుంచి పట్నం దాకా ఇంటివినియోగం నుంచీ, ప్రయాణాల సందర్భంగా వినియోగం దాకా ఈ పది రూపాయల కేటాగిరీ సబ్బుకు చెప్పలేనంత గిరాకీ ఉంది.

మొత్తం రూ.15వేల కోట్ల విలువ కలిగిన సబ్బుల మార్కెట్లో 6వేల కోట్ల రూపాయల సబ్బులు అంటే, మొత్తం ఉత్పత్తిలో 35నుంచి 40 శాతం వరకు ఈ కేటగిరీ సబ్బులే ఉన్నాయంటే దీని ప్రాధాన్యత ఎంతో ఇట్టే చెప్పొచ్చు. అయితే ఈ పరిశ్రమ ఇటీవల ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఇంత తక్కువ మొత్తానికి సబ్బులను అమ్మగలమా, లేమా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇటీవల వీటి ఉత్పత్తి వ్యయం ఊహించినంత ఎత్తుకు పెరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు రూపాయి విలువ క్షీణించడంతో ఈ ఉత్పత్తి వ్యయం మరింత పెరిగిపోతున్నది. ఉత్పత్తికి అవసరమైన పామాయిల్‌ ఆరేళ్ల కిందట ఉన్న రేటు ఇప్పుడు రెట్టింపు దాటిపోవడంతో పరిశ్రమ డైలామాలో పడిపోయింది.

ఈ రంగంలోని గాద్రెజ్‌ వంటి కంపెనీలు ఈ చిన్న సైజు సబ్బుల ఉత్పత్తి నుంచి వైదొలగాలని భావించాయి. అయితే అంత సులభంగా అమ్మకాలు వదులుకొని మిగతా రంగాలకు ఎగబాకటం సాధ్యం కాలేదు. రూపాయి మారకం విలువ ఇంకా పడిపోతే, క్రూడ్‌ ధరలు మరింత పెరిగితే ఈ సబ్బుల ధర పెరచడం గానీ, ఈ కేటగిరీ సబ్బుల ఉత్పత్తి నిలిపివేయడం గానీ జరగవచ్చు. లేదా ఇదివరకున్న బరువుని తగ్గించి మరింత చిన్న సబ్బులను అదే ధరకు అమ్మకాలు కొనసాగించవచ్చు. ‘మేము ఊహించిన దానికంటే ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. పోనీ నిలుపు చేద్దామా అంటే అమ్మకాలు వదులుకోవడం ఇష్టం లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితి అని పరిశ్రమకు ఒక నిపుణుడు పేర్కొన్నారు. మరొక మూడు నాలుగు నెలలు వేచి చూసిన ధరిమిలా ఒక నిర్ణయం గైకొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వినియోగదారులకు రూ.10 ధరలోనే సబ్బు లభ్యమవుతోంది. అయితే ఎంత కాలమనేది పెద్ద ప్రశ్నార్ధం.