పెద్దనోట్లు రద్దు భారీ కుంభకోణం

Rahul gandhi
Rahul gandhi

15మందిపారిశ్రామికవేత్తలకే మోడీ ప్రయోజనాలు
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ ధ్వజం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ఒక భారీ కుంభకోణమని, అది ఎంతమాత్రం పొరపాటు కానేకాదని, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందేనని, ఆర్ధికవ్యవస్థపై ఒక పెద్ద గాయం చేశారని ఆరోపించారు. నిరుద్యోగం, తక్కువ ఆర్ధికవృద్ధిరేటు, జిడిపి వృద్ధిపరంగా వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నోట్లరద్దునిర్ణయం అనాలోచితమేనని అన్నారు. ప్రధానిమోడీ కేవలం 15-20మంది పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగపడుతున్నారని అన్నారు. వారి రుణాలేనేడు నిరర్ధక ఆస్తులుగా మారిపోతున్నాయన్నారు. ఆర్‌బిఐ 99.3శాతం రద్దయిన నోట్లస్థానంలో కరెన్సీ వెనక్కి వచ్చిందని తిరిగి చెలామణిలోనికి వచ్చిందని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. న్యూఢిల్లీ లో ఆయన మీడియాసమావేశంలో మాట్లాడుతూ ఆర్ధికవ్యవస్థపై పెద్ద గాయం చేశారని అన్నారు. తీవ్రస్థాయి ఆర్ధికసమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తుంటేమోడీ పెద్దనోట్ల రద్దు ఎందుకుచేసారని ఆయన ప్రశ్నించారు. కేవలం 15-20 మంది తన వ్యాపార మిత్రులకోసం మాత్రమే చేస్తున్నారని, వారికి ఇచ్చిన భారీ రుణాలే నేడు ఎన్‌పిఎలుగా మారాయని అన్నారు. బడాపారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన వేలాదికోట్లే ఇపుడు తిరిగిరికవరీలేనిస్థితిలో ఉన్నాయని, ఈ సొమ్మంతా నేడు పెట్టుబడిదారులవద్దకే చేరిందన్నారు. అయితే దీనిపై బిజెపని వెంటనే స్పందిస్తూ రాహుల్‌గాంధీ 15 మంది పారిశ్రామికవేత్తల పేర్లేతీసుకుంటున్నారని, 2014 తర్వాత వారిలో ఏ ఒక్కరైనా సంపన్నులుగా అయ్యారా అన్నది తెలియజేయాలని డిమాండ్‌చేసింది. పాత విధానాలు వాస్తవాలను మరుగునపెట్టలేవని బిజెపి అధికార ప్రతినిధి శాంబిట్‌ పాత్ర వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు తమ చెల్లనిబ్యాంకునోట్లను వారి వారి బ్యాంకుఖాతాల్లో జమచేసేందుకు ప్రయత్నించారని, దీనివల్లపెద్ద మొత్తం డిపాజిట్లు బ్యాంకులకు వచ్చిచేరాయని రిజర్వుబ్యాంకు బుధవారం వెల్లడించింది. ఆర్‌బిఐ తన నివేదికలో 99.3శాతం చెల్లనినోట్లస్థానంలో కొత్తకరెన్సీ వచ్చిచేరిందని, 15.3 లక్షలకోట్లు కరెన్సీలో 99.3శాతం వచ్చిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేసారని 15.44లక్షలకోట్లు దీనితో రద్దయినట్లు రాహుల్‌ విమర్శించారు. 2016 నవంబరు 8,9 తేదీలు భారత్‌కు చీకటిరోజులని అన్నారు. అయితేప్రధానిమోడీ చెపుతుననట్లుగా నల్లధనం కట్టడిచేయడం,నకిలీ కరెన్సీని నిర్మూలించడం, అవినీతి నిర్మూలన, ఉగ్రవాదం కట్టడి వంటివాటిలో ఏ ఒక్కటీ లక్ష్యాలను చేరుకోలేదని రాహుల్‌ విమర్శించారు. మావోయిస్టులు గరిష్టసంఖ్యలో లొంగిపోయారని, పెద్దనోట్ల రద్దు తర్వాతనే ఈ సంఘటన జరిగిందని, దీన్నిబట్టి ఉగ్రవాదం తగ్గినట్లు కాదా అని బిజెపి ప్రతినిధి ప్రశ్నించడం, దీనిపై రాహుల్‌కు సరైన అవగాహన లేదని ఎద్దేవాచేయడం గమనార్హం. ప్రధానమంత్రిపై రాహుల్‌ గాంధీ విమర్శల దాడినిచేస్తూ పెద్దనోట్ల రద్దు ఎట్టిపరిస్థితుల్లోను అనుకోని తప్పుకాదని, ఇదొక కుంభకోణం అని దీనివల్ల చిన్నమధ్యతరహా బిజినెస్‌లు భారీగా దెబ్బతిన్నాయన్నారు. గుజరాత్‌లోని సహకార బ్యాంకు డైరెక్టర్‌గా బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పనిచేసారని,ఆ బ్యాంకు ఒక్కటే పెద్దనోట్ల రద్దులో 700 కోట్లు కరెన్సీ మార్పిడిచేసిందని రాహుల్‌ గుర్తుచేసారు. గడచిన70ఏళ్లలో సాధించలేనిది నాలుగేళ్లలో సాధించామని మోడీ చెప్పడం నిజమేనని, ప్రజలను 70ఏళ్లలో ఎప్పుడు ఇబ్బంది పెట్టనవిధంగా ఈ నాలుగేళ్లలో ఇబ్బందులు పెట్టారని ఎద్దేవాచేసారు. నిజంగానే మోడీ ఆర్ధిక వ్యవస్థను విఛ్ఛిన్నంచేసారని రాహుల్‌ ఆరోపించారు.