పెట్రోల్‌, డిజిల్‌ కార్ల నిషేదంపై చైనా వ్యూహాలు

China
China

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్‌, డిజిల్‌తో నడిచే కార్లను నిషేదించాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే సంగతి
తెలిసిందే. ప్రస్తుతం ఈ కోవలోకి చైనా దేశం చేరబోతుంది. ఆటో పరిశ్రమకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా సంచలన నిర్ణయం  తీసుకోబోతుంది.పెట్రోల్‌, డిజిల్‌తో నడిచే కార్లపై నిషేదం విధించాలని చైనా వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు దానికి సంబందించిన పరిశోధనను కూడా దేశం ప్రారంభించిందని, కానీ ఏప్పటి నుంచి ఈ రద్దు నిర్ణయం అమల్లోకి తీసుకురావాలో ఇంకా నిర్ణయించాల్సి ఉందంటూ ఆ దేశ ఇండస్ట్రీ ఉప మంత్రి పేర్కొన్నారు. తమ కారు పరిశ్రమ అభివృద్ది కోసం తీవ్ర మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి జిన్‌ గుబిన్‌ జిస్తువాకు వివరించారు. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయం ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని తెలిసింది. ప్రపంచంలో కార్లకు అతిపెద్ద మార్కెట్‌గా చైనానే ఉంది. ప్రపంచంలో మూడొంతుల కార్లు ఈ దేశంలోనే తయారవుతున్నాయి. ఎక్కువగా చైనా సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడుతుందని,దీంతో కాలుష్యం, కర్బన్‌ ఉద్గారాల విడుదల ఎక్కువగా జరుగుతుందని తెలిసింది. ఈ కారణంతో చైనా సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించాలని
టార్గెట్‌గా పెట్టుకుంది. చైనా ఇప్పటికే ఈ ప్లాన్‌ను ఆటోమొబైల్‌ తయారీదారులకు వివరించింది.2020 వరకు ఎలక్ట్రిక్‌,హైబ్రిడ్‌ పెట్రోల్‌-ఎలక్ట్రిక్‌ వాహనాల పేరును 12 శాతం పెంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రభుత్వ రంగ విద్యుత్‌ కంపెనీలను ఆదేశించింది. గీలి, వోల్పో చైనీస్‌ యజమాన్యం 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. రెనాల్డ్‌-నిస్సాన్‌, ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ కూడా చైనాలో ఎలక్ట్రిక్‌ కార్ల అభివృద్దిపై పనిచేస్తున్నాయి.