పునరావాస కేంద్రాలుగా ధర్మకర్తల మండళ్లు!

Temple
Temple

భా రతీయ సంస్కృతికి మారుపేరుగా భక్తివిశ్వాసాల నిలయాలుగా ప్రజాదరణ పొంది ఒకనాడు దేదీప్యమా నంగా వెలుగొందిన ఆలయాలు దీనావస్థకు చేరుకుంటున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్యపూజలకు గతిలేక, దీపం పెట్టే దిక్కులేక కళావిహీనంగా మిగిలిపోతున్నాయి. జీర్ణావస్థకు చేరుకుంటున్నాయి. మరొకపక్క ఆదాయం ఉన్న దేవాలయాల్లో అవినీతి, అవకతవకలు రాజ్యమేలుతు న్నాయి. మొన్న దక్షిణాదిలోనే అత్యంత ప్రతిష్టమైన పుణ్యమైన బాసర సరస్వతీ ఆలయంలోనే అవకత వకలకు, అవినీతికి కొందరు ఉద్యోగులే పాల్పడినట్లు ఆరోపణలు రావడం అత్యంత దురదృష్టకరం.

తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాల్లో హుండీల్లో కూడా హస్తలాఘవం ప్రయోగిస్తున్న పెద్దల భాగోతం ఎన్నో సార్లు బయటపడింది. ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిశ్వర దేవాలయంలో కూడా ఎసిబి అధికారులు చేసిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఎన్నో దేవాలయాలకు సంబంధించి దేవ్ఞని ఆస్తులు దిగమింగిన పెద్దలపై విచారణల పేరుతో కాలయాపన చేశారే తప్ప నిర్దిష్ట మైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. రాజకీయ అవసరాల కోసం దేవ్ఞడిని, దేవాలయాలను దైవభక్తిని దుర్వినియోగం చేసే దుష్టసంప్రదాయం ఆరంభమైన ప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం మొదలైందనే చెప్పొచ్చు. పవిత్రమైన హిందూదేవాలయ వ్యవస్థలో పాలకుల జోక్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని, గతంలో ఎందరో ధర్మాచార్యులు, పీఠాధిపతులు ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు.

దేవాలయాలపై వచ్చే ఆదాయం దైవప్రచారానికి, ధార్మిక కార్యక్రమా లకు వినియోగించాలని పలువ్ఞరు మఠాధిపతులు ఏనాటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఎన్నో విదేశీ దాడులు ఎదుర్కొని మరెన్నో ఆటుపోట్లు తట్టుకున్న దేవ్ఞళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీని నివారించలేకపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లో నిత్యం పూజలు అందుకోని దేవ్ఞళ్లు, దేవాలయాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆస్తులు స్వాహా చేయడమే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప శిల్పఖండాలున్న దేవాలయాల ప్రాంగణాల్లో విగ్రహాలను పెకిలించుకుపోతున్నారు. ఈ ముఠాలు అప్పుడప్పుడు పట్టుబడుతున్నా వారిపై అంతంత మాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడంతో అవి నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ముఠాలు పట్టుబడ్డాయి. కేసులు పెడుతున్నారు.

జైళ్లకు పంపుతున్నారు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతో బయటకు వచ్చి మళ్లీ యధాప్రకారం అదే కొనసాగిస్తు న్నారు. దేవ్ఞళ్ల ఆస్తులను పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖ కూడా అంత శ్రద్ధ చూపడం లేదేమోననిపిస్తు న్నది. అసలు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల భూములు ఎన్ని? ఎవరెవరి ఆధీనంలో ఉన్నాయి? వాటిపై రావాల్సిన ఆదాయం ఎంత? ఎంత వస్తు న్నది? తదితర స్పష్టమైన వివరాలు దేవాదాయశాఖ వద్ద ఇప్పటికీ స్పష్టంగా లేవ్ఞ. పాలకులు అధికారులతో ఇలాంటి ప్రమాదం ఉంటుందనే దేవ్ఞళ్ల ఆస్తులను కాపాడేందుకు, భక్తులు సమర్పించుకునే ప్రతిపైసా సద్వినియోగం చేసేందుకు ఎంతో ముందుచూపుతో మన పెద్దలు ధర్మకర్తల వ్యవస్థను ఏనాడో ఏర్పరి చారు. ఎలాంటి జీతభత్యాలు లేకుండా లాభాపేక్ష లేకుండా దేవ్ఞని సేవలో తరించాలనుకునే ఆశయాలు ఉన్నవారిని, భూరి విరాళాలు సమర్పించుకున్నవారిని దేవాలయాల ధర్మకర్తలుగా నియమించేవారు.

వారు ఎంతో నీతినియమాలు, నియమనిష్టలు, భక్తివిశ్వాసాల తో సత్ప్రవర్తనతో ప్రజలకు ఆదర్శంగా అనుకరణీ యంగా ఉండేవారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామరాజకీయాలు చోటుచేసుకోవడంతో ఆ ప్రభావం దేవాలయ వ్యవస్థపై కూడా పడింది. ధర్మ కర్తల మండలి రాజకీయ పునరావాసంగా మారిపోయిం ది. వ్యక్తిగత గుణాలు, దైవచింతన వంటి ఉత్తమ గుణాలు పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయయులను, పార్టీ కార్యకర్తలను ధర్మకర్తల మండలిలో నింపడమే పనిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైనప్పటి నుండి ఆలయవ్యవస్థ భ్రష్టుపట్టింది. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న తిరుపతి వెంకన్న కూడా ఈ అవినీతిపరుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

పేరుకు అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అధికారంలో ఉన్న నాయకులు ఏమి ఆదేశిస్తే అది జరగాల్సిందే. ఇప్పుడు నూతనంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ధర్మకర్తలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ ప్రభుత్వమైనా విజ్ఞతతో ఆలోచించాలి. దేవాలయ ధర్మకర్తలను నియమించేటప్పుడు వ్యక్తిగత చరిత్రను, సేవాధర్మనిరతిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆలయాల ఆస్తులను పరిరక్షించే ఉద్యమంలో భాగస్వాములవ్ఞతా రన్న విశ్వాసం ఉన్నవారిని ధర్మకర్తలుగా నియమిస్తే కొంతలో కొంతవరకైనా దేవ్ఞళ్లకు, దేవాలయాలకు, ఆస్తులకు రక్షణ ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే తాము భక్తితో సమర్పించుకుంటున్న కానుకలు సద్వినియోగం కావడం లేదని ప్రజల్లో అనుమానాలు ఏర్పడితే ఎటువైపు దారిస్తుందో ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలి.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌