పుజారి కాంకర్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం

Maoist
Maoist

హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌ఘడ్‌లో గల బీజాపూర్‌ జిల్లా పుజారి కాంకర్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం మావోయిస్టు పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. పుజారి కాంకర్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వున్న ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో విశ్రాంతి తీసుకుంటున్న మావోయిస్టులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తమ పార్టీ అగ్రనేతలు హరిభూషణ్‌, దామోదర్‌, రాజిరెడ్డితో పాటు మరికొందరు వున్నట్లు పోలీసులు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని ఆయన వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్‌, రాంపూర్‌కు చెందిన రత్నతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ, బీజాపూర్‌ ప్రాంతాలకు చెందిన క్షేత్రస్థాయి సభ్యులు పది మంది ప్రాణాలు కోల్పోయారని జగన్‌ వెల్లడించారు. గిరిజనులకు చెందిన సహజ వనరులను ప్రభుత్వాలు కార్పొరేట్‌ శక్తులకు అమ్మేస్తున్నాయని ఇది ఎంత మాత్రం సమ్మతం కాదని ఆయన విమర్శించారు. ఛత్తీస్‌ఘడ్‌ లోని బిజెపి సర్కార్‌, తెలంగాణలోని తెరాస సర్కారు ఈ ఎన్‌కౌంటర్‌కు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ దాడికి ప్రతీకారంగా తెరాస నాయకులపై దాడులు చేస్తామని ఆయన తెలిపారు. దళితులు, గిరిజనులతో కలిసి ప్రభుత్వాల పాశవిక దాడులను ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.