పుకార్ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్దు

CP Mahendera Reddy
DGP Mahendera Reddy

హైద‌రాబాద్ః రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు అని సూచించారు. అనుమానితులను చూడగానే స్థానికులు దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పారు. డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దు.
గ్రామాల్లో వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా సీసీటీవీ వ్యవస్థ పటిష్టంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.