పుంజుకుంటున్న చమురు ధరలు

OIL--

పుంజుకుంటున్న చమురు ధరలు

న్యూఢిల్లీ: వారాంతాన అంతర్జాతీయ మార్కెట్లలో చమురుకు డిమాండ్‌ పుట్టడంతో రేట్లు కూడా 3శాతం పెరిగాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 1.9 డాలర్లు పెరిగి 62.75 డాలర్లకు చేరింది. ఈ దారిలోనే న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ కూడా 1.5శాతం పెరిగి 55.26 డాలర్ల వద్ద నిలిచింది. ఇవి ఆరు వారాల గరిష్టం కావడం విశేషం. వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఆ దేశం నుంచి చమురు ఎగుమతు లకు విఘాతం కలుగు తోంది. దీంతో చమురు సరఫరాలు తగ్గుముఖం పట్టగా, గతవారం అమెరికా 15 రిగ్గులను కుదించుకుంది. మరోవైపు జనవరిలో అమెరికా వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 3.04లక్షలకు చేరాయి. ఇవి 2018 ఫిబ్రవరి తర్వాత అత్యధికం కాగా, ఆర్థిక వ్యవస్థ జోరుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చైనా ఉత్పత్తిరంగం జనవరిలో మూడేళ్ల కనిష్టానికి చేరడం ద్వారా వాణిజ్య వివాద ప్రభావాన్ని పట్టి చూపుతున్నట్లు వివరించారు. కాగా, ధరలకు స్థిరత్వాన్ని తీసుకువచ్చే బాటలో సౌదీ అరేబియా, లిబియా ఉత్పత్తి తగ్గింపును చేపట్టడం ధరల పెంపునకు కారణమైనట్లు పేర్కొన్నారు. లిబియాలో షరారా చమురు క్షేత్రంలో కార్మిక సమస్యల కారణంగా ఉత్పత్తి క్షీణించినట్లు తెలియచేశారు.