పీయూష్ గోయ‌ల్‌కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌

Piyush goyal
Piyush goyal

తన కడుపులో విపరీతమైన నొప్పి కలుగుతోందని రైల్వే మంత్రి పీయుష్ గోయల్ చెప్పడంతో ఆయన్ను హుటాహుటిన ముంబై సిటీ హాస్పిటల్ లో చేర్చారు. కడుపునొప్పితో పాటు గొంతు కూడా మంటగా ఉందని ఆయన చెప్పినట్టు రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలో పర్యటిస్తూ, ఇటీవల ఘోర ప్రమాదం జరిగిన ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద సైన్యం నిర్మిస్తున్న పాదచారుల వంతెనను పరిశీలించేందుకు వచ్చిన పీయుష్ అనారోగ్యం బారిన పడ్డారు.
అంతకుముందు ఆయన సీనియర్ రైల్వే అధికారులతో చత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ లో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. బహుశా ఆయన ఎసిడిటీతో బాధపడుతూ ఉండవచ్చని, తన నొప్పి గురించి చెప్పగానే, అంబులెన్స్ ను పిలిపించామని, అయితే, ఆయన తన వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, బాగానే ఉన్నారని తెలిపారు.