పివి సింధు శుభారంభం

PV Sindhu
PV Sindhu

పివి సింధు శుభారంభం

మలేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భాగంగా జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్‌ 14 ర్యాంకు క్రీడాకారిణి ఆయా ఒహోరీపై 26-24, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. ఆరంభంలో తడబడిన పివి సింధు ఆ తర్వాత అనుభవంతో అద్భుతంగా పుంజుకుంది. దీంతో తొలి గేమ్‌లో ఇరువురు తమ ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే, రెండో గేమ్‌లో సింధు పైచేయి సాధించి మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.తొలి రౌండ్‌లో వాంగ్‌జూ వీ (చైనీస్‌ తైపీ)తో పోరులో ప్రణీత్‌ 12-21, 7-21 తేడాతో ఓడిపోయంది. ఏకపక్షంగా సాగిన పోరులో ప్రణీత్‌ ఏ దశలోనూ వాంగ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు.

ఇదే టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌, రాంకీరెడ్డి, చిరాగ్‌ షెట్టీ తమ తొలి రౌండ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే తొలి రౌండ్‌లో విజయం సాధించిన సైనా నెహ్వాల్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.