పిల్లలతో సాయి

జ్ఞానుల చేష్టలు బాలునివలె, పిశాచమువలె ఉంటాయి. సాయిబాబా చేష్టలు ఇందుకు ఏమాత్రం భిన్నంగా వుండవు. సాయి జ్ఞానులతో జ్ఞాని, పిల్లవాల్లతో పిల్లవాడు, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని సరదాగా కబుర్లు, కథలు చెప్పేవారు. పాటలు పాడించేవారు. దాసగణు ఆధ్వర్యంలో తుకొరాంబువా ఆజ్‌గాంకర్‌ 7,8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సాయి ఎదుట పాటలు పాడాడు. సాయి పిల్లలతో ఫొటోలు కూడా దిగేవారు. బిడ్డలకు ప్రసాదాలు ప్రత్యేకంగా ఉంచేవారు. పిల్లలకు నామకరణాలు చేసేవాడు. పుట్టిన రోజు పండుగలు చేసేవాడు, వాటిలో పాల్గొనేవాడు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేవాడు. పరీక్షలకు పోయేముందు సాయి నుండి ఊది తీసుకువెళ్లేవారు పిల్లలు. ఆయన కరుణవల్ల పరీక్షలలో పిల్లలందరూ కృతార్థులయ్యేవారు. షిరిడీ గ్రామంలోనికి మామిడి, జామపండ్ల బుట్టలు, చెరకుగడలు అమ్మకానికి వచ్చేవి. సాయి కొనేవారు. మశీదులో ఉంచేవారు. పిల్లలు వాటిని దొంగిలించేవారు సరదాగా. పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా ద్వారకమాయి నుండి ఎండుకట్టెలు దొంగిలించేవారు. సాయి కూడా చూసిచూడనట్లు ఉండేవారు. పెద్దవారు ఇంకా సాయి ద్వారకామాయిలో ఉంచిన చిలింగొట్టాలు దొంగలించేవారు. సాయి పట్టించుకునేవారు కాదు. లక్ష్మణ్‌భట్‌ అనే వ్యక్తి తన బాల్యాన్ని గూర్చి ఇలా పలికాడు. సాయిబాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వచ్చేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేం దొంగిలించేవాళ్లం. ఒక్కోసారి దొంగిలిస్తున్నప్పుడు సాయిబాబా మమ్మల్ని పట్టుకుని ‘మరీ ఎక్కువగా తీసుకోకండిరా! అని హాస్యధోరణిలో అనేవారు. సాయి సన్నిధిలో గారడీ ప్రదర్శనలు, నాట్యాలు జరిగేవి. గోసాయీలు వచ్చేవారు. ఎలుగుబంట్లను ఆడించేవారు వచ్చేవారు. ఈకల టోపీలు ధరించి, ఆటలు ఆడేవారు వచ్చేవారు. పగటి వేషగాళ్లు వచ్చి ప్రదర్శనలు ఇచ్చేవారు. శ్రీరామనవమి ఉత్సవాలకు సర్కస్‌ కంపెనీ వచ్చి ప్రదర్శనలు ఇచ్చేది. సర్కస్‌వాడు ఊరేగింపు కోసం ఏనుగులను పంపేవారు. ఆ సమయంలో పిల్లలకేమిటి? పెద్దవాళ్లకూ సందడే సందడి. శ్రీకృష్ణుడు బాల్యంలో గోపబాలురతో ఆడిన తీరువేరు. సాయి పెద్ద అయినప్పుడు కూడా, పిల్లలతో కూడా సమయం గడిపేవాడు. నిజానికి ఏ అవతారము చూపనంత చనువును సాయిబాబా పిల్లలపై చూపేవారు. అంటే అది అతిశయోక్తి కాదు. సాయిబాబా తన వద్దకు ప్రతిదినం వచ్చే పిల్లలు రాకపోతే, వారికోసం ప్రసాదాలు దాచిపెట్టేవారే. ఏ పిల్లవానికి ఏ ప్రసాదం ఇష్టమో సాయికి తెలుసు. ఆ ప్రసాదాన్నే ఆ పిల్లవానికి సాయి ఇచ్చేవారు. ఉద్దరరావు దేశపాండే శ్యామా యొక్క ఏకైక కుమారుడు. సాయి ఆ పిల్లవానికి జీడిపప్పు పాకం ఎక్కువ ఇష్టం అని, తరచుగా అదే ఇచ్చేవారు అతనికి. ప్రధాన్‌ కుమారుడు ‘బాబుకు వండిన పదార్థాలు ఎక్కువగా నచ్చేవికావు. అందువలన సాయిబాబాకు మామిడిపండ్లు, ఇతర ఫలాలను ఎక్కువగా ఇచ్చేవారు. ఇవే బాబు కడుపు నింపేవి.
బత్తాయిపండు కోరిన సాయి
సాయి భక్తుడు బల్వంత్‌నాచ్నే వెంట అతని స్నేహితుడు దాత్‌ కూడా సాయి దర్శనానికి షిరిడీ వచ్చాడు. ఆరోజు రాత్రి అతడు ఉపవాసం ఉంటాడు. ఎందుకంటే ఆ దినం ఏకాదశి కాబట్టి. అందుకని అతడు బత్తాయి పండ్లను వాడాలో వుంచి సాయి దర్శనానికి వచ్చాడు. ఈలోగా ఒక మార్వాడీ పాప సాయిబాబాను బత్తాయిపండ్లు ఇవ్వమని మారం చేయసాగింది. సర్వవ్యాపకుడు సాయికి ఆ సమయంలో బత్తాయిపండ్లు ఎవరి వద్ద ఉన్నాయో తెలియకుండా ఉండదు. పాప కోరిక తీర్చడం కోసం, తన స్థాయి నుండి దిగి దాత్‌ను బత్తాయి పండ్లు తెచ్చి ఇమ్మని కోరాడు. సాయి అడగడం అందరకూ ఆశ్చర్యమనిపించింది. అది సాయి పిల్లలపై చూపే ప్రేమనురాగాలకు చిన్న ఉదాహరణ.
– యం.పి.సాయినాధ్‌