పిలవని పేరంటానికి అతిధిలా కేసీఆర్‌

guduru narayana reddy
guduru narayana reddy

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సరికాదు
టీ పీసీసీ కోశాధికారి గూడూరు
హైదరాబాద్‌: ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల సీఎంల ఇళ్లలో పేరంటానికి పిలవని అతిధిలా ప్రవేశిస్తున్నారని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన బుధవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నానంటూ పశ్చిమ బెంగాల్‌, ఒడిషా సీఎంలు మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ను కలసి చర్చలు జరిపితే ఏమాత్రం స్పందించలేదని ఎద్దేవా చేశారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌కు కనీసం నామమాత్రంగానైనా ఆహ్వానం పంపకపోయినా,తనంతట తానుగా వెళ్లి వారిని కలవడం ఆయనకు వారు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పడానికి నిదర్శనమన్నారు. నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీ ఇద్దరూ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదు…అయినప్పటికీ ఆయన తనంతట తానుగానే వెళ్లి వారిని కలవడంతో పాటు వారు ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తామని చెప్పినట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌ కేసీఆర్‌ ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరిస్తానని స్పష్టం చేయలేదనీ, ఈ మేరకు వీరిద్దరూ మీడియా ముఖంగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఈ తరహా చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పాదాల వద్ద తాకట్టు పెట్టి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్నాయక్‌, మమతా బెనర్జీ పరిణతి చెందిన, దేశ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకులనీ, సెక్యులరిజాన్ని కాపాడటానికి చిత్తశుద్ధితో వారు కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయినా కేసీఆర్‌ వారి చుట్టూ తిరగడం కేవలం రాజకీయంగా బీజేపీకి లాభం చేయడానికేనని పేర్కొన్నారు. కేసీఆర్‌ కేవలం మోడీ ఆదేశాల మేరకే ఈ ఫ్రంట్‌ల పేరుతో తిరుగుతున్నారనీ, ఇది కేవలం యూపీఏను దెబ్బతీసి ఎన్డీయేకు లబ్ది చేకూర్చడానికే కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను దేశంలో ఏ రాజకీయ పార్టీ నమ్మదనీ, అందుకే ఆయన పనిగట్టుకుని వారి వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం టైం వేస్ట్‌ చేయకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ సీఎంగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్‌ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం మాని పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి సూచించారు.