పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు ఇక సులభం

Passport
Passport

న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ దరఖాస్తు మరింత సరళతరం, సులభతరం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది.పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సమయంలో పోలీసు విచారణ పేరుతో ఎక్కువ సమయం వృధా చేసేవారు. ఇప్పుడు అలా చేయకుండా మార్పులు చేస్తున్నారు. ఇదివరకు పాస్‌పోర్టు జారీ కోసం కనీసం ఏడాదిపాటు ఉన్న ఇంటి అడ్రస్‌నే చూపించాల్సి వచ్చేది. పోలీసులు కూడా దానినే పరిశీలించేవారు. వారు అక్కడ ఉంటున్నారా, లేదా అనేది నిర్ధారించుకునేందుకు ఆ ప్రాంతంలోని ఇద్దరి వ్యక్తుల పేర్లను విచారణకు వచ్చిన పోలీసులకు ఇవ్వాల్సి వచ్చేది. అయితే వారి వివరాలతోపాటు వారి ఇంటి అడ్రస్‌ను కూడా తీసుకునేవారు. ఇప్పుడు ఈ నిబంధనలను పూర్తిగా ఎత్తివేశారు. దరఖాస్తులో ఎవరి పేర్లను రాయాల్సిన అవసరంలేదని విశాఖపట్టణం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పి చౌదరి తెలిపారు. దరఖాస్తుదారుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటూ విచారణకు పంపే పోలీసులకు గతంలో తొమ్మిది ప్రశ్నలు వేసేవారు. ఇప్పుడు వీటిని తగ్గించి ఆరు ప్రశ్నలకు చేశారు. ఫలితంగా పాస్‌పోర్టు దరఖాస్తు మరింత సులభతరం కావడంతో పాటు జారి విషయం కూడా తొందరగా కానుంది. నిబంధనల్లో భాగంగా దరఖాస్తుదారుతోగానీ, వారి తల్లిదండ్రులతోగానీ పోలీసులు మాట్లాడాల్సిన పనిలేదు. అసలు వారి ఇంటికీ వెళ్లనవసరంలేదు. గతంలో దరఖాస్తుదారుపై పోలీసు కేసులేమైనా ఉన్నాయా? లేవా? ఇండియన్‌ అవునా? కాదా? అనే విషయాలను పోలీసులు ధృవీకరిస్తే సరిపోతుందని విదేశాంగ శాఖ స్పష్టంగా పేర్కొంది.