పార్లమెంటు ఎన్నికలకు తెలుగుదేశం సన్నద్దం

L.Ramana
L.Ramana

జిల్లా అధ్యక్షులతో ఎల్‌. రమణ భేటీ
సభ్యత్వ నమోదుకు శ్రీకారం..
జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై నివేదికలు..
పొత్తుపై చంద్రబాబుదే తుది నిర్ణయం
హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలన్నీ తలకిందులై పార్టీ తక్కువ స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో ఇన్నాళ్లు కొంత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు మళ్లీ ఉత్సాహం నింపే పనిలో రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో పార్టీ జిల్లాల అధ్యక్షులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌. రమణ భేటీ అయ్యారు. ఇందులో పోలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితోపాటు మరికొందరు సీనియర్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గత అసెంబీ ఎన్నికల్లో పార్టీకి (కూటమికి) నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాలో ఎన్ని ఓట్లు వచ్చాయి? అందులో పార్టీ ఓట్లు ఎన్ని ఉంటాయనేది చర్చించారు. జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై నివేదిలు ఇవ్వాలని ఆయన కోరారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు పార్టీ నాయకులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగానే పోటీ చేయాలా? అనేది పార్టీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని రమణ స్పష్టం చేశారు.
కాగా ఈ సమావేశం అనంతరం మీడియాతో రావుల మాట్లాడుతూ ఇందులో చర్చించిన అంశాలను వివరించారు. తెలంగాణలో వన్‌ ప్లస్‌ వన్‌ ప్రభుత్వం నడుస్తోందని ఆయన విమర్శించారు. బిజెపి కనుసన్నల్లో టిఆర్‌ఎస్‌, వైస్సార్సీలు నడుస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం పెత్తనంపై మాట్లాడిన కేసిఆర్‌..మమతా బెనర్జీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే..పంటకు మద్దతు ధర ప్రకటించాలని రావుల డిమాండ్‌ చేశారు. మమత బెనర్జీకి టిడిపి మద్దతు ఉంటుందన్నారు. టిడిపి-టిఎస్‌ జిల్లాల అధ్యక్షులు సమావేశంలో పార్లమెంటు ఎన్నికల సమాయత్తం చర్చించినట్లు రావుల చెప్పారు. రెండు విడతలుగా జిల్లాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈసమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదన్నారు. టిడిపి-టిఎస్‌ సభ్యత్వం గడువు ముగిసిందని, ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వం రెన్యువల్‌ చేయలేదని, సభ్యత్వం
మళ్లీ డ్రైవ్‌ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు రావుల తెలిపారు. తెలంగాణలో టిడిపికి 8 లక్షల సభ్యత్వం ఉందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి-టిఎస్‌ మద్దతుతో గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు గెలిచారని ఆయన వివరించారు.