పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ రే శుక్రవారం నాడు తన ఎమ్మెల్యే పదవికి , బిజెపికి రాజీనామా చేశారు. ప్రజా అంచనాలకు తగ్గట్లు పనిచేయలేకపోయానని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేశానని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా రూర్కెలా నియోజకవర్గం నుంచి పోటీ చేయనని అన్నారు. 2014 ఎన్నికల్లో స్టీల్ సిటీ హామీతో బరిలోకి దిగానని, ప్రజలు ఆదరించడంతో ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికి ప్రజల అంచనాల మేరకు పని చేయలేకపోయినందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, ఎమ్మెల్యే పదవితో పాటు బిజెపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.