పాత‌బ‌స్తీకి కొత్త రూపురేఖ‌లుః కేసిఆర్‌

KCR
KCR

హైద‌రాబాద్ః వెయ్యికోట్లతో పాతబస్తీ రూపురేఖలను మార్చే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు. ఓల్డ్‌సిటీ అంటే సమస్యల పుట్ట అనే పేరును చెరిపేసి సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. చార్‌సౌసాల్ పురానా షహర్‌పై నయా రోష్నీ వేసేందుకు ముందుకు కదిలారు. కరెంటు, రోడ్లు, కాల్వలు, రిజర్వాయర్లు, వంతెనలతో పౌరసదుపాయాల మెరుగుదలకు స్వయంగా శంకుస్థాపనలు చేసి పనులను కదంతొక్కిస్తానని ప్రకటించారు. పాతనగరంలో విద్యుత్, మంచినీరు, సీవరేజి, నాలాలు, ఎస్సార్డీపీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమైక్యపాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పాతనగరంలో వెయ్యికోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ నగరంలో మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.