పాత్రికేయ విలువలకు దర్పణం కుల్దీప్‌నయ్యర్‌

PAWAN
PAWAN

హైదరాబాద్‌: ప్రముఖ పాత్రికేయుడు, బ్రీటీష్‌ మాజీ హై కమీషనర్‌ కుల్దీప్‌నయ్యర్‌ పాత్రికేయ విలువలకు దర్పణంగా నిలిచారని జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆయన మృతి తనకు బాధ కలిగించిందని తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వర్థమాన రాజకీయాలు, సామాజిక, పౌర అంశాలపై కుల్దీప్‌నయ్యర్‌ నిర్మోహమాటంగా అభిప్రాయాలను తెలిపేవారన్నారు. బియాండ్‌ ది లైన్స్‌, ఇండియా ఆఫ్టర్‌ నెహ్రు లాంటి ఆయన రచనలు విశ్లేషణాత్మకంగా, నాటి పరిస్థితులను తెలియచేచేలా ఉంటాయని ప్రశంసించారు. తన ఆలోచనలకు నిర్భీతిగా ఆక్షర రూపం ఇచ్చారని చెప్పారు. పౌర సేవలు మరింత మెరుగుపడంతోపాటు, పారదర్శకంగా ఉండాలని కుల్దీప్‌నయ్యర్‌ తపించారని వెల్లడించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పారన్నారు. బ్రిటీష్‌ హై కమీషనర్‌గా, రాజ్యసభ సభ్యునిగానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కుల్దీప్‌నయ్యర్‌ మృతికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.