పాక్‌ పర్యటనను వాయిదా వేసిన విండీస్‌ బోర్డు

West Indies Team
West Indies Team

పాక్‌ పర్యటనను వాయిదా వేసిన విండీస్‌ బోర్డు

న్యూఢిల్లీ: పిసిబికి వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఝలక్‌ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ పర్యటనకి తాము వెళ్లబోమని వెస్టిండీస్‌ క్రికెటర్లు క్రిస్‌గేల్‌, కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో ఆ దేశ క్రికెట్‌ బోర్డుకి తేల్చి చెప్పేశారు. దీంతో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌ పర్యటనను వాయిదా వేసింది. మూడు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ దేశంలో ఆటగాళ్ల భద్రత గురించి సీనియర్‌ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెస్టిండీస్‌ బోర్డు ప్రకటించింది. దీనిపై పిసిబి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత నెలలో శ్రీలంక జట్టు లాహోర్‌ వేదికగా ఒక టీ20 మ్యాచ్‌ ఆడిన నేపథ్యంలో ఇకపై టెస్టు హోదా కలిగిన జట్లు పాక్‌లో పర్యటిస్తాయని ఆశించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి)కి తాజాగా విండీస్‌ నిర్ణయంతో చుక్కెదురైంది.

పాక్‌ పర్యటన గురించి విండీస్‌ బోర్డు ఆటగాళ్ల నుంచి అభిప్రాయాలు కోరగా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసిసితో పాటు వెస్టిండీస్‌ ఏర్పాటు చేసిన భద్రతా కమిటీ కూడా…లాహోర్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ….జట్టులోని సీనియర్‌ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్‌ పర్యటనని నిరాకరించడంతో విండీస్‌ వెనక్కి తగ్గక తప్పలేదని పాక్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

దీంతో వచ్చే ఏడాది రెండు జట్లకు ఖాళీ ఉన్నప్పుడు షెడ్యూల్‌ రూపొందిస్తా మని బోర్డు వర్గాలు తెలిపాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లు లాహోర్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఆడేందుకు బస్సులో వెళ్తుండగా వారిపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి జట్టు కూడా ఆ దేశంలో పర్యటించే సాహసం చేయడం లేదు. ఇటీవలే వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో సెప్టెం బర్‌లో మూడు టీ20లు ఆడింది. ఆ తర్వాత ఇదే వేదికలో శ్రీలంక జట్టు అక్టోబర్‌ 29న ఒక టీ20 ఆడింది. ఈ రెండు జట్లు అక్కడ పర్యటించినా పాక్‌లో ఆడేందుకు వెస్టిండీస్‌ క్రికెటర్లు ససేమిరా అనడం విశేషం. ఇదిలా ఉంటే, నవంబర్‌ 25 నుంచి వెస్టిండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.