పాక్‌ తోక కట్‌ చేసిన అమెరికా

MIKE
MIKE

పాక్‌ తోక కట్‌ చేసిన అమెరికా

33 బిలియన్ల సహాయం రద్దు పాక్‌ బుద్ధి మారలేదన్న అమెరికా

వాషింగ్టన్‌: ఆదివారం పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదు లను ఎదుర్కొనేందుకు సైనిక సహాయంగా అమెరికా అందిస్తున్న 33బిలియన్‌ డాలర్లను అమెరికా పూర్తిగా నిలిపివేసింది. బుధవారం అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పోంపియో ఇస్లామాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. గత కొద్ది నెలలుగా సహాయాన్ని నిలిపివేస్తామని పలు సార్లు స్వయంగా ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ కొన్ని ఆంక్షలతో అమెరికా ధన సహాయాన్ని పాక్‌కు అందిస్తూనే ఉంది.

అయితే 2002 నుండీ ప్రతి ఏడాదీ 33బిలియన్ల డాలర్లను పాక్‌కు సహాయంగా అందిస్తున్న అమెరికా… ఆదివారం వైట్‌హౌస్‌ చేసిన ప్రకటనతో పాక్‌కు ఇకనుండి శాశ్వతంగా సైనిక అవసరాలకోసం సహాయం నిలిచిపోయింది. ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికా నిధులు అందిస్తుంటే పాక్‌ మాత్రం పరోక్షంగా ఉగ్రవాదులకు, వారిసానుభూతి పరు లకు సహాయాన్ని అందిస్తోంది. దీంతో వివిధ ఉగ్రవాద గ్రూపులు పాక్‌లో స్థిరంగా నాటుకు పోయాయి. ముఖ్యంగా అల్‌ఖైదా తన స్వరూపాన్ని మార్చుకొని పలు గ్రూపులుగా మారి పాక్‌లో మకాం పెట్టింది. ఇటు పాక్‌లోనూ అటు ఆఫ్గానిస్థాన్‌లోనూ తాలీబాన్‌ గ్రూపులను పాక్‌ పరోక్షంగా సహాయాన్ని అందిస్తోంది.

దీంతో తాము అందించే నిధులు ఉగ్ర వాద నిర్మూలనకు కాకుండా ఉగ్రవాద సంక్షేమానికి ఉపయోగ పడుతున్నాయని అమెరికా ఆగ్రహంతో ఉంది. ట్రంప్‌ పలుసార్లు ఈ విషయంలో పాక్‌ను నేరుగా హెచ్ఛరించారు. దక్షిణాసియాలో పాక్‌ చర్యల వల్ల ఉగ్రవాదం పెరుగుతోందని తక్షణం పాక్‌కు సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు పెంటగాన్‌ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. తాలీ బాన్‌లతో పోరాటం చేస్తామని దాదాపు 17 ఏళ్లుగా అమెరికా నుండి సహాయం పొందుతున్న పాకిస్థాన్‌ అబద్ధాలు చెప్పిందని పెంటగాన్‌ ప్రతినిధి అన్నారు.

ఇంతకాలం పాక్‌ అబద్ధాలు చెబుతూ అమెరికాను మోసం చేసిందని ప్రతినిధి అన్నారు. పాక్‌కు నిలిపివేసిన నిధులను ఉగ్రవాద నిర్మూలనకే వినియోగించే నిమిత్తం కాంగ్రెస్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పాక్‌లో ఏర్పడిన ఇమ్రాన్‌ ప్రభుత్వం అమెరికాను చికాకు పెట్టేలా ప్రవర్తిస్తోందని అన్నారు. ఇరాన్‌ విదేశంగ మంత్రిని పాక్‌ పర్యటనకు ఆహ్వానించటం అమెరికాకు నచ్చలేదని అన్నారు. అక్రమంగా అణు కార్యక్రమాలను చేపడుతున్న ఇరాన్‌కు పాక్‌ దగ్గరగా మెలగటం ప్రపంచానికి చేటు చేస్తుందని అన్నారు.

కాగా పాక్‌లో కొత్తగా ఏర్పడిన ఇమ్రాన్‌ ప్రభుత్వం అమెరికా నిర్ణయంపై సూటిగా స్పందించలేదు. అమెరికా నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నట్లు పాక్‌ విదేశాంగ ప్రతినిథి ఒకరు తెలిపారు.