పాక్ క్రికెట్లో రచ్చ!
కరాచీ : స్పాట్ ఫిక్సింగ్ కేసులో అయిదేళ్ల నిషేదం పూర్తి చేసుకున్నపాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహ్మమద్ అమిర్ మళ్లీ క్రికెట్ అడుగు పెట్టే విషయంపై పాకిస్థాన్ క్రికెట్లో అభిప్రాయభేదాలు చోటు చేసుకున్నాయి. అమీర్ శిక్షణ శిబిరానికి రావడంతో అతనితో ఆడటం ఇష్టం లేక వన్డే కెప్టెన్ అజర్ అలీ,వెటరన్ మహమ్మద్ హఫీజ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు కూడా. ఇప్పుడు అమిర్ పునరాగమనానికి అర్హుడా ? కాదా అన్నది రచ్చకు ఎక్కి రచ్చ రచ్చ అయింది.అమిర్ క్రికెట్ల్లో ఉండాలా,వద్దా అన్న అంశంపై ఓ టివి చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు మొహమ్మద్ యూసుఫ్,రమీజ్ రాజా మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం పరస్పర వ్యక్తిగత దూషణలకు దారి తీసింది.ఈ చర్చ సందర్భంగా రాయడానికి కూడా తగని పదాలతో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు.నీకు క్రికెట్ గురించి ఏం తెలుసు, నువ్వు పైరవీలతో క్రికెట్లోకి అడుగుపెట్టిన వాడివి.పాఠాలు చెప్పుకోవడానికి పనికొచ్చే వాడివి అంటూ రమీజ్‌పై యాసుఫ్ మండిపడ్డాడు.కాగా రమీజ్ రాజా కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు.గడ్డం పెంచగానే ముల్లావి అనిపించుకోవు,అబద్దాలు చెబుతూ బ్రతుకుతూ ఉంటావ్, పాక్ క్రికెట్లో గందరగోళం సృష్టించావు,నువ్వో నకిలీ ముస్లింవి అంటూ యూసుఫ్‌పై రమీజ్ ఒంటికాలిపై లేచాడు.వారిద్దరి వ్యక్తిగత దూషణలపై సోషల్ మీడియాలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవు తుంది.అలా జరిగి ఉండాల్సింది కాదని, అది అత్యంత దురదృష్టకరమని పాకిస్థాన్ మాజీ టెస్ట్ కెప్టెన్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. అమీర్‌ను తిరిగి తీసుకోవడంపై రమీజ్ రాజా తన అభిప్రాయం స్పష్టంగా ఉందని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనేది కాలమే చెబుతుందన్నాడు.అమీర్ అంశంపై క్రికెట్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండిందని పేర్కొన్నాడు.