పరిత్రాణములు

ఒకప్పుడు లిచ్ఛవి గణతంత్ర రాజ్యంలో కరువు సంభవించింది. ఆకలిచావులు ఎక్కువైనాయి. దిక్కులేని శవాలు కుళ్ళిపోవడంతో అంటువ్యాధులు ప్రబలినాయి. లిచ్ఛవి పరిపాలకులకు దిక్కు తోచలేదు. బుద్ధుడు దేశంలో అడుగుపెడ్తే అంతా చక్కబడుతుందని భావించారు. అప్పుడు బుద్ధుడు మగధ రాజధాని రాజగృహ సమీపంలోని వేణువనంలో ఉన్నాడు. లిచ్ఛవిరాజ్య ప్రతినిధిగా ఒక రాజకుమారుడు తన పురోహితుణ్ణి వెంట బెట్టుకొని కొన్ని దినాల ప్రయాణం తరువాత వేణువనం చేరుకొని బుద్ధుణ్ణి ప్రార్థించాడు. బుద్ధుడు ప్రయాణానికి సమ్మతి తెలిపాడు. తథాగతుని ప్రయాణ వార్త బింబిసారుడు రాజగృహం నుండి గంగానది ఒడ్డున ఉన్న పాటలి గ్రామం వరకు వెళ్ళే రహదారిని బాగు చేయించి యోజనానికి ఒక విశ్రామశాల నిర్మించాడు. గంగానది ఆవలివైపు నుండి వైశాలి వరకు లిచ్ఛ విరాజులు రహదారిని సుందరంగా తీర్చి అక్కడక్కడా విశ్రామశాలలు ఏర్పాటు చేసి బుద్ధుని రాకకై వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. లిచ్ఛవిరాజుల నమ్మకం వమ్ము కాలేదు. బుద్ధుడు రాజ్యంలో అడుగుపెట్టగానే వర్షాలు పడడం మొదలయ్యింది. వాగులు, వంకలు, చెరువులు, బావులు అన్నీ నిండాయి. వైశాలి చేరాక బుద్ధుడు ఆనందునికి రత్న సూత్రం చెప్పి ఆ సూత్రాన్ని నగరం అంతటా తిరుగుతూ ఏడుసార్లు పారాయణ చేసి రమ్మన్నాడు. ఆనందుడు నగరంలోని వీధులన్నీ సంచరిస్తూ రత్న సూత్రాన్ని పారాయణ చేశాడు. అంటువ్యాధులు మాయమయ్యాయి. ప్రజలను బాధల నుండి కాపాడింది కనుక రత్న సూత్రానికి పరిత్రాణం అనే పేరు ఏర్పడింది. తరువాతి కాలంలో రత్నసూత్రంలాంటి మరికొన్ని సూత్రాలను కూడా పరిత్రాణములుగా భావించి పారాయణ చేయడం అమలులోకి వచ్చింది. ఉదాత్త అనుదాత్త స్వర నియమాలను పాటించి ఒక లయబద్ధంగా పరిత్రాణ సూత్రాలను పారాయణ చేస్తే ఒక విధమైన ప్రకంపనములు ఉత్పన్నమై ఆశించిన ఫలితాలు కొద్దో గొప్పో కనబడడం జరుగుతుంది. వైశాలిలో ఆమ్రవన ఆరామంలో బుద్ధుడుండగా ఒకనాడు బోధిరాజ కుమారుడు అక్కడికి వచ్చి తాను నూతన గృహప్రవేశం చేస్తున్నానని బుద్ధుడూ భిక్షు సంఘమూ వేంచేసి అనుగ్రహించవలసినదిగా కోరాడు. బుద్ధుడు సమ్మతించాడు.
ఈ వరకే ఉన్న భవనానికి ఏం లోపం వచ్చిందని బోధిరాజకుమారుడు మయసభలాంటి ఆ కొత్త భవనం కట్టుకొన్నాడో మనకు తెలియదు. అతనూ అతని భార్య కాంతిమతి తప్ప ఇంకెవరూ లేరు ఉండడానికి. అంత పెద్ద భవనం ఎందుకో? బుద్ధుని రాకకోసం మహాద్వారం వద్దే నిలబడి ఎదురు చూస్తున్నాడు. అతని హృదయంలో ఏదో ఒక ఆశ. మహాద్వారం ప్రవేశ మార్గంలో చాలా విలువైన ఒక తెల్లని వస్త్రాన్ని పరచాడు. బుద్ధుడు ఆ వస్త్రం మీద కాలుపెడితే తనకు సంతానయోగం ఉంది అనుకొన్నాడు. ఏ హేతువు ఆధారంగా అతను అలా అనుకొన్నాడని ప్రశ్నించడానికి లేదు. అది కేవలం అతని పిచ్చి నమ్మకం. బుద్ధుడు వస్త్రం మీద కాలు పెట్టలేదు. ఆనందునిచేత దాన్ని తొలగింపజేసి లోనికి కాలు పెట్టాడు. బోధిరాజ కుమారుడు విచార వదనంతో బుద్ధుణ్ణి అనుసరిస్తూ వెనకనే నడిచాడు. భవనంలోకి వెళ్ళాక బుద్ధుడు అతణ్ణి సముదాయిస్తూ ”బోధిరాజా, విచారించకు. నీకు సంతాన ప్రాప్తి లేకపోవడానికి కారణం పూర్వజన్మకర్మ విపాకమే.
న ప్రణశ్యంతి కర్మాణి కల్పకోటిశతైరపి ,సామగ్రీం ప్రాప్య కాలం చ ఫలంతి దేహినామ్‌
వందకోట్ల కల్పాలైనా సరే చేసుకొన్న కర్మ, ఫలం ఇవ్వకుండా నశించదు. అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఫలాన్ని ఇచ్చివేసి అది నశిస్తుంది. నీవు పూర్వం ఒకానొక జన్మలో భార్యా సమేతంగా ఒక నావలో పయనిం చావు. ఒక చిన్న దీవి సమీపంలో ఆ నావకు విపత్తు సంభవించింది. నీవు, నీ భార్య ఎలాగో ప్రాణాలతో ఆ దీవి చేరారు. మీ ఆకలి బాధ పోగొట్టే ఆహారం ఆ దీవిలో లేదు. చెట్లల్లోని పక్షిగూళ్ళ నుండి అండాలను సేకరించుకొని తింటూ బ్రతికారు. ప్రాణం నిలుపుకోవడం జీవధర్మమే అయినా మీరు ఒక్కసారి కూడా కౌకృత్యం చెందలేదు. ఆ పాపమే మిమ్మల్ని ఈ జన్మలో సంతాన విహీనులుగా చేసి దెబ్బ తీసింది. బ్రహ్మసహంపతి వచ్చినా ఈ కర్మ నియతి నుండి మిమ్మల్ని తప్పించలేడు. కనుక పరిహరించడానికి వీలుకాని విషయంలో విచారించవలసిన పని లేదు. మీ సంపదను పేదపిల్లల అనాథపిల్లల సంక్షేమానికి వినియోగించండి. ఆ పిల్లల ముఖ వికాసం చూస్తూ మీరూ ఆనందించండి అని క్రింది శ్లోకం చెప్పాడు.

ఆత్మనైన కృతం పాపం ఆత్మజమాత్మసంభవమ్‌, అభిమథ్నాతి దుర్మేధనం వజ్రమివాశ్మమయం మణిమ్‌

తన పాపానికి తానే కర్త. అది తన వల్లే పుడ్తుంది. తన వల్లే కలుగుతుంది. ఏ మణిశిల నుండి వజ్రం ఏర్పడిందో ఆ మణిశిలనే అది నూరివేయగలుగుతుంది కదా! అలాగే దుర్మేధసుని స్వయంకృతములున్నూ.
– వేదమణి