పబ్స్‌‌పై నియంత్రణ ఎందుకు లేదని ప్రభుత్వానికి భట్టి ప్రశ్న…

హైదరాబాద్ లో పబ్స్ కారణంగా దారుణాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ , లైంగిక దాడులు , రోడ్డు ప్రమాదాలు ఇలా అన్ని పెరిగిపోతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక ఫై గ్యాంగ్ రేప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ అత్యాచారం ఘటన వెనుక రాజకీయ నేతలు కొడుకుల ప్రమేయం ఉండడం తో వీరిని తప్పించే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్ష పార్టీ లు , ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటన పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నగరంలో పబ్, డ్రగ్స్ లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇష్టానుసారంగా మద్య విక్రయాలు చేపట్టడమే కాకుండా… పబ్బులకు అనుమతులు ఇస్తుండడంతో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ ఘటనపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తుంటే..అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యత వహించాలని, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా.. మైనర్‌‌లను పబ్ ల్లోకి ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ మద్యం సరఫరా ఎలా చేస్తున్నారని నిలదీశారు. పబ్స్ పై నియంత్రణ లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.