పత్తి పైనే మోజు

cotton
cotton

82 శాతం సాగైన తెల్ల బంగారం
మద్దతు ధర పెంపుతోనే రైతుల ఆసక్తి
వరి పంట సాగైంది 21 శతమే
అంతంత మాత్రంగా ఆహార ధాన్యాల సాగు
ఏడు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజనులో రైతాంగం పత్తి పైనే మోజు చూపుతున్నారు. సీజను ప్రారంభమైన 40 రోజుల్లోనే ఏకంగా 82 శాతం పత్తిని విత్తారు. ప్రధానమైన వరి కేవలం 21 శాతం మాత్రమే సాగైంది. ఆహార ధాన్యాల సాగు కంటే మించి పత్తి సాగుకావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాధారణ విస్తీర్ణం 16,80,029 హెక్టార్లు కాగా ఇప్పటి వరకూ 13,83,651 హెక్టార్లలో విత్తారు. మద్దతు ధరలను పెంచడంతోనే రైతులు పత్తిపై దృష్టి సారించినట్లు వ్యవసాయ శాఖ అధికారవర్గాలు భావిస్తున్నాయి. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరాతోపాటు, వివిధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి లభ్యత పెరుగుతున్నందున వరి పంట సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ భావిస్తున్నా క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సాగునీటి వసతి ఉన్నవారే కాకుండా లేని వారు సైతం వర్షాలను నమ్ముకుని పత్తి విత్తనాలనే వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2018-19 సంవత్సరానికిగాను మధ్య రకం పత్తికి క్వింటాలుకు 5,150 రూపాయలు, పొడవు రకానికి 5,420 రూపాయల చొప్పున కేంద్రం మద్దతు ధరను ప్రకటించింది. గత ఏడాది ఈ రెండు రకాలకు క్వింటాలుకు 4,020 రూపాయలు, 4,320 రూపాయలు కనీస మద్దతు ధరలు ఉండేవి. ఈ ఏడాది వీటిని గత ఏడాది కంటే 26.11 శాతం పెరించింది. పత్తి మద్దతు ధర ఒకేసారి ఏకంగా క్వింటాలుకు 1,100 రూపాయలు పెంచడం గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఈనేపథ్యంలోనే రైతులు పత్తిని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా వ్యవసాయ సీజను 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుత వానాకాలం సీజనుకు 20.70 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారవర్గాలు అంచనా వేశాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు అయ్యే విస్తీర్ణం మరింత పెరుగుతుందని లెక్కకట్టారు. ఇందుకు అనుగుణంగా పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత వానాకాలం సీజనులో 1.05 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని లెక్కకట్టిన వ్యవసాయ శాఖ ఆమేరకు ఏర్పాట్లు చేసింది. గత ఏడాది అంటే 2017-18 వానాకాలం సీజనులో 79.15 లక్షల పత్తిన విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 25.85 లక్షల ప్యాకెట్లు అదనంగా సిద్ధం చేశారు. పత్తి విత్తనాలను సరఫరా చేసే బాధ్యతను 43 కంపెనీలకు వ్యవసాయ శాఖ అధికారులు అప్పగించారు. నూజివీడు విత్తన కంపెనీకి 13.17 లక్షల ప్యాకెట్లు, రాశి విత్తన కంపెనీకి 17.23 లక్షల ప్యాకెట్లు, కావేరి విత్తన కంపెనీకి 16.25 లక్షల పత్తి విత్తనాలను సరఫరా చేసే బాధ్యతలను అప్పగించారు.
ఇదే సమయంలో వరి సాగు ఇంకా వేగం పుంజు కోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 21 శాతం మాత్రమే వరి సాగు చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వరి సాధారణ విస్తీర్ణం రాష్ట్రం మొత్తం మీద 9,50,032 హెక్టార్లు కాగా ఇంత వరకూ కేవలం 1,96,037 హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. మిగిలిన పంటల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది సరైన ధర లేక నష్టపోయిన పప్పు ధాన్యాలు, సోయాచిక్కుడు పంటలను పండించిన రైతులు సైం ఈ సారి పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి తరువాత ప్రధాన పంటలైన మొక్కజొన్న 5,36,392 హెక్టార్లకుగాను 2,90,221 హెక్టార్లలోనూ, కంది 2,86,152 హెక్టార్లకుగాను 2,05,921 హెక్టార్లలోను, పెసలు 1,00,552 హెక్టార్లకుగాను 55,585 హెక్టార్లలోను, సోయాబీన్‌ 2,30,730 హెక్టార్లకుగాను 1,67,619 హెక్టార్లలోను సాగైంది. ఈవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఆహార ధాన్యాల సాగు 41 శాతానికి మాత్రమే చేరింది. వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, కందులు, మినుములు, పెసలు తదితర ఆహార ధాన్యాల సాగు రాష్ట్ర వ్యాప్తంగా 19,62,764 హెక్టార్ల మేర సాధారణ విస్తీర్ణం కాగా, ఇంత వరకూ 8,01,152 హెక్టార్లలోనే సాగైంది. ఇంకా 59 శాతం మేర ఆహార ధాన్యాల పంటల సాగు కావాల్సి ఉంది. ఇక వేరెశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ఆయిల్‌ పంటలకు సంబంధించి సాధారణ విస్తీర్ణం 3,09,042 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ 1,96,168 హెక్టార్లలోనే సాగైంది. ఇక పసుపు, చెరకు, మిర్చి, ఉల్లిపాయల పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. పసుపు సాధారణ విస్తీర్ణం 54,878 హెక్టార్లకుగాను 32,667 హెక్టార్లలోను, చెరకు 34,924 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానానికిగాను 14,992 హెక్టార్లు, మిర్చి 69,144 హెక్టార్లకుగాను కేవలం అతి తక్కువగా 5 శాతం చొప్పున 3,530 హెక్టార్లలోను సాగైంది. దీనికి తగినట్లుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానాకాలం సాగు ముందుకు సాగడం లేదు. పలు జిల్లాల్లో తక్కువ వర్షపాతం కారణంగానే సాగు అంతంత మాత్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. వానాకకాలం సీజను ప్రారంభం నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 217.2 మిల్లీ మీటర్లు కాగా, నమోదైంది 255.7 మిల్లీ మీటర్లు నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం 547.2 మిల్లీ మీటర్లు చోటు చేసుకుంది. అత్యంత తక్కువగా 123.5 మిల్లీ మీటర్లతో గద్వేల్‌ జిల్లా నమోదైంది. రాష్ట్రంలోని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సాధారణం కంటే -16 శాతం, రాజన్న జిల్లాలో -17 శాతం, సంగారెడ్డిలో -8 శాతం, మెదక్‌లో -15 శాతం, సిద్దిపేట్‌లో -22 శాతం, జనగామ జిల్లాలో -11 శాతం, యాదాద్రి జిల్లాలో -6 శాతం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో 18 శాతం వానాకాలం సాగు జరుగ్గా, గద్వేల్‌లో 26 శాతం, సూర్యాపేట్‌లో 27 శాతం, ఖమ్మంలో 31 శాతం, జగిత్యాలలో 28 శాతం, నాగర్‌కర్నూల్‌లో 40 శాతం మాత్రమే సాగు జరిగింది.