పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

cotton
cotton

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజనుకు సంబంధించి దిగుబడి అయ్యే పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో దిగుబడి అయిన పత్తి కొనుగోలుకు ఇప్పటికే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రంగంలోకి దిగి వాటికి సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పత్తి మార్కెట్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. పత్తికి మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పుతోంది. గత ఏడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా ఈ నెల నుండి రాష్ట్రంలో పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లోగా అక్టోబర్‌ నెలాఖరుకల్లా వివిధ ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు సీసీఐ ప్రతినిధులు వెళ్లడిస్తున్నారు. గత ఏడాది వరకూ దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు పలు ప్రాంతాల్లో తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని తక్కువ ధరలకు విక్రయించి నష్టపోయారు. వారు నిర్ణయించిన ధరలకే రైతులు తెగనమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. మరోపక్క కేంద్రప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరలను పెంచిన విషయం తెలిసిందే. గత ఏడాది వరకూ క్వింటా పత్తి 4,320 రూపాయలు ఉండగా, దీన్ని తాజాగా 5,450 రూపాయలకు కేంద్రం ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించింది. రైతులు పత్తి వ్యాపారులకు కాకుండి సిసిఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మద్దతు ధరలు లభించే వీలుందని భావిస్తున్న రైతుల ఆలోచన మేరకు కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సిసిఐకు విజ్ఞప్తి చేశారు. దీనికితగినట్లుగా రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్‌ బార్‌ కోడ్‌ కార్డులు రైతులకు అందించనున్నారు. గత ఏడాది క్యూఆర్‌ బార్‌ కోడ్‌ కార్డులు రైతులకు ఆలస్యంగా అందచేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గత ఏడాది అందచేసిన క్యూర్‌ బార్‌ కోడ్‌ కార్డుల ద్వారానే రైతుల నుండి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే ధృవీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకునే వీలును కల్పిస్తూ నిర్ణయించారు.