‘పఠాన్‌కోట్‌’ అనుమానితులు పాక్‌లో అరెస్టు

pathankot
ఇస్లామాబాద్‌ : భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌పై ఈనెల 2న జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత్‌ హెచ్చరికలు, అమెరికా వంటి అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు పాక్‌ తలొగ్గక తప్పలేదు. పఠాన్‌కోట ఉగ్రదాడి ఘటనపై పాక్‌ అనూహ్యంగా స్పందించింది. పఠాన్‌కోట దాడి సూత్రదారులను పట్టుకునేందుకు పాక్‌ అధికారులు తమ దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. సోమవారం కొందరు అనుమానితులను అరెస్టు చేసినట్లు పాక్‌ నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్‌లోని గుజ్రాన్‌వాలా, జెలూమ్‌, బహవల్పూర్‌ జిల్లాల్లో నిఘా వర్గాలు దాడులు నిర్వహించాయి. అనుమాన్పాద వ్యక్తులను అరెస్టు చేశారు. పఠాన్‌కోట ఉగ్రదాడిలో వీరికి సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నటు పాక్‌ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. పఠాన్‌కోట దాడి ఘటనపై పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటిలిజెన్స్‌ బ్యూరో, ఐఎస్‌ఐ, మిలటరీ ఇంటిలిజెన్స్‌, ఫెడరల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ, పోలీసులు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయకముందే పాక్‌ ప్రధాని షరీఫ్‌ సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించి, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నటు ప్రకటించారు. దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఒక్కరోజులనే పలువురు అనుమానితులను అరెస్టు చేయడంతో విచారణ వేగం పుంజుకున్నట్లు అయ్యింది. ఇదిలా ఉండగాచ పఠాన్‌కోట దాడి సూత్రదారులపై పాక్‌ చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శుల సమావేశం జరగబోదని భారత్‌ జాతీయ భద్రతా సలహాదాడరు అజిత్‌ దోవల్‌ హెచ్చరించారు. దీంతో పాక్‌ పై తీవ్ర వత్తిడి పెరిగి పఠాన్‌కోట ఉగ్రదాడిపై చిట్టచివరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.