పటాన్‌ చెరు ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్‌

– అనర్హుడేనంటున్న ఎన్నికల కమిషన్‌
– జిల్లా కోర్టులో అప్పీల్‌కు ప్రయత్నిస్తున్న మహిపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌ : హైదరాబాదు శివారు ప్రాంతంలోని పటాన్‌ చెరు నియోజకవర్గ శాసన సభ్యుడు మహిపాల్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఇప్పటికే ఆయనను అనర్హుడిగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. నారాయణ ఖేడ్‌ ఉప ఎన్నికలతో పాటు అక్కడ కూడా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నమని ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ ప్రకటించారు. పటాన్‌ చెరు నియెజక వర్గంలోని పారిశ్రామిక వాడలో ఒక ఫ్యాక్టరీలో మహేష్‌ అనే కార్మికుడు మృతి చెందాడు. ప్యాక్టరీలో జరిగిన ప్రమాదం కారణంగా అతను చనిపోయాడు కావున అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఎంఎల్‌ఏ మహిపాల్‌ రెడ్డి సదరు ఇండస్ట్రీ యాజమాన్యాన్ని డిమాండు చేశాడు. వారు కొంత మాత్రమే చెల్లించేందుకు సిద్ధపడ్డారు. అయితే రూ.15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని మహిపాల్‌ పట్టుపట్టారు. ఆ విషయంలో తీవ్ర వాగ్వివాదాలు తోపులాటలు జరిగాయి. ఒక దశలో మహిపాల్‌ అను చరులు అక్కడి వస్తువులను ద్వంసం చేశారు. ఆ విషయంపై సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం మహిపాల్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ విషయంపై నమోదైన కేసును సంగారెడ్డి ఫస్ట్‌ క్లాస్‌ మేజేస్ట్రేట్‌ కోర్టు విచారించింది. ఆ కేసులో మహిపాల్‌ రెడ్డిని దోషిగా నిర్దారిస్తూ గత గురువారం తీర్పునిచ్చింది. ఆ మేరకు అతనికి రెండున్నరేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2,500 జరిమానా విధించింది. అయితే జిల్లా కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. కాగా 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రెండేళ్లకు పైబడి శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించాలని సూచించింది. సదరు మార్గదర్శకాల ప్రకారం మహిపాల్‌ రెడ్డిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. అయితే అసెంబ్లీ స్పీకర్‌ ఆ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉందని భన్వర్‌లాల్‌ అన్నారు. అయితే సంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పులో నెల రోజుల వ్యవధిలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఆ కోర్టులో కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకునే అవకాశం ఉందని కొందరు న్యాయవాదులంటున్నారు. ఈ విషయంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సదరు మహిపాల్‌ రెడ్డికి కోర్టు శిక్ష విధించినందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. ఆ మేరకు విచారణ జరుగుతోంది.