పండ్లతో పళ్లు తళతళ

Dental Care
Dental Care

పండ్లతో పళ్లు తళతళ

సాధారణంగా పండ్లు తినని వారు ఉండరు. ప్రతి పండు కూడా తీయగా, పుల్లగా, కొంచెం వగరుగా ఉండి, చూడటానికి మంచి రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. పండ్లు చూడటానికే కాకుండా, తినటానికి కూడా అనువ్ఞగా ఉండి, విటమిన్లు, పోషక పదార్థాలు అధిక మొత్తంలో ఉండి ఆరోగ్యానికి దోహదపడ తాయి.సాధారణంగా పండ్ల లోపలి భాగం పరి శుభ్రంగా ఉంటుంది. లోపల ఏ విధమైన రోగ పూరిత క్రిములకు చోటు లేకుండా ఉంటాయి. పండ్లను మనం తిన్న వెంటనే శక్తి లభించే అవకాశం ఉంటుంది.

పండ్ల రసంలో గ్లూకోజ్‌, చక్కెర పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ ఉండటం వల్ల, అవి ద్రవరూపంలో ఉండటం వల్ల నోటిలోని మ్యూకస్‌ మెంబ్రేన్‌, నాలుక కింద ఉండే జీవకణాలు ఈ రసాన్ని పీల్చుకుని రక్తానికి అందించటం ద్వారా శక్తి వెలువడుతుంది. అంటే పండ్ల రసం జీర్ణకోశం వరకూ వెళకుండానే నోటిలోనే జీర్ణమైపోయి మనకు శక్తినిస్తుంది. ప్రతి పండులో కొంచెం పులుపు ఉంటుంది. అంటే సిట్రిక్‌ ఆమ్లం. ఈ సిట్రిక్‌ ఆమ్లం కలిగిన పండ్లను సిట్రస్‌ ఫ్రూట్స్‌ అంటారు.

వీటిని కొరికి తిన్నప్పుడు వాటిలోని సిట్రిక్‌ ఆమ్లం పళ్లకు తగిలి పళ్ల మీద ఉండే పాచి (ప్లేక్‌) అంతా శుభ్ర పడుతుంది.సిట్రిక్‌ ఆమ్లం పళ్లకు తగలడం వల్ల పళ్లపై ఉండే నున్నని పొర ఎనామిల్‌ కొద్దిగా మెత్త బడుతుంది. తద్వారా ఎనామిల్‌పైన ఉండే మచ్చలు, మరకలు పోతాయి. అంటే బట్టలు ఉతికే సబ్బులు, డిటర్జెంట్ల ఏవిధంగా బట్టల మురికిని వదలగొట్టి తెల్లబరుస్తాయో, అలాగే ఈ సిట్రిక్‌ ఆమ్లం ఎనామిల్‌ను శుభ్రపరచి పళ్లు తళతళలాడేలా చేస్తాయి. పండ్లు తినడంవల్ల వాటిలోని గుజ్జు పదార్థం – సాధారణంగా ఫైబర్‌, పీచు పదార్థం, జీవకణాలతో గట్టిగా ఉంటుంది కనుక – పళ్ల మధ్య నిలువ ఉండే కుళ్లిన ఆహారపు అణువ్ఞలు బైటకు వచ్చి పళ్లు శుభ్రపడటానికి వీలు కలుగు తుంది. మనం ఏ పండ్లు తిన్నా కొంచెం పుల్లగా, తియ్యగా, వగరుగా ఉంటాయి. ఇటువంటి పండ్లు కొరికిన వెంటనే మన నోటిలో లాలాజల గ్రంథులనుండి లాలాజలం ధారాళంగా స్రవించడం జరుగుతుంది. పండ్ల రసం ఈ లాలా జలంతో కలిసి నోటిలో తిరగడాడటం వల్ల పళ్లు బాగా శుభ్రపడతాయి.