పండుటాకులకు కొండంత అండ..!

ayyanna patrudu
ayyanna patrudu

రూ.2 వేల పింఛన్‌ సాహసోపేత నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యం!

ఆర్‌అండ్‌బి మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్య
నర్సీపట్నంటౌన్‌ (విశాఖపట్నం): వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచడం దేశ చరిత్రలో గొప్ప సాహసోపేత నిర్ణయమని ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని ఆర్‌అండ్‌బీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రూ.200లు ఉన్న పింఛన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదు రెట్లు పెంచి నేడు ఏకంగా పది రెట్లు పెంచారన్నారు. దివ్యాంగులకు రూ.1,500ల నుంచి 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ.2,500ల నుంచి 5 వేలకు పెంచడమే కాకుండా రెండు చేతులు కోల్పోయిన వారికి రూ.10 వేల పింఛను ఇవ్వడం ప్రస్తుత తరుణంలో చంద్రబాబు వంటి నాయకుడే చేయగలరని నిరూపించుకున్నారు. ప్రస్తుతం రైతు ఆరుగాలం కష్టబడి పెట్టుబడులుపోనూ ప్రకృతి కరుణిస్తే ఏడాదికి రూ.6 వేలు రావడం కష్టతరమంగా వున్న తరుణంలో ఏడాదికి ఎటువంటి కష్టం లేకుండా ఇంట్లో కూర్చుంటూ రూ.24 వేలు తెచ్చుకుంటున్నారంటే అది చంద్రబాబు దయ వలనేనని ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా వుందన్నారు. పెంచిన పింఛన్‌ సొమ్ముకుగానూ ఏటా రూ.15,600 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో వున్న నేపథ్యంలో కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఇటువంటి సాహసోపేత నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 35 వేల మందికి పైచిలుకు పింఛన్లు పొందుతున్నారన్నారు. పింఛను పొందుతున్న వారంతా టీడీపీకి తప్పనిసరిగా ఓటు వేస్తారని ఇది సత్యం.. నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అదేవిధంగా త్వరలోనే రైతుల సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ఇదేకాకుండా ఎన్టీఆర్‌ వైద్యసేవకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న వారికే నగదు అందించేవారని ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవాలు చేయించుకున్న వారికి కూడా ప్రభుత్వం నుంచి రాయితీలు అందించేందుకు జోవో విడుదల చేయనున్నారన్నారు.
మహిళలను గౌరవించేది టీడీపీ పార్టీయే
మహిళల పట్ల గౌరవంగా మెలిగే పార్టీ ఒక్క టీడీపీయేనని ఇది ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించినప్పటినుంచి కొనసాగుతూనే ఉందని ఆర్‌అండ్‌బీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. టీడీపీ నాయకులపై షర్మిల తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ తప్పుడు ఫిర్యాదులు ఓట్ల రాజకీయమేనని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జగన్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ ముగ్గురు కలుసుకోవడం ఆశ్చర్యమన్నారు. మొన్నటివరకు జగన్‌ ఒక దొంగ అటువంటి దొంగ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జైలులో వుంచితే జైలు కూడా పాడవుతుందన్న వ్యక్తులు నేడు కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. షర్మిల ఎక్కడైనా ఫిర్యాదు చేసుకుంటే రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఫిర్యాదు చేసుకుంటే మంచిది తప్ప జగన్‌ చెల్లిగా చేసుకోవద్దమ్మా అంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో సూచనలు చేయడం మరొక విశేషమన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే మాకూ కూడా ఇవ్వాలని పట్టుబట్టిన కేటీఆర్‌ నేడు ప్రత్యేక హోదా కోసమే జగన్‌తో మంతనాలు జరుపుతున్నామని అనడం ఇది ఎటువంటి రాజకీయమో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మించొద్దని గతంలో కేసీఆర్‌ కుమార్తె కవిత సుప్రీం కోర్టుకు వెళ్లారని అదే పోలవరంపై మాట్లాడటం శోచనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే రెండో స్థానం దక్కించుకుందన్నారు. విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.5200కోట్లు చెల్లించాల్సి వుండగా అది చెల్లించకుండా ఏపీ అభివృద్ధికి పాటుపడతామని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఎవరు ఎవరితో కలిసి మరలా ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు. సమావేశంలో చింతకాయల విజయబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.