పండగగా కొత్త పంచాయతీ ప్రారంభోత్సవాలు

CELEBRATIONS
CELEBRATIONS

హైదరాబాద్‌: స్వయం పాలన దిశగా పల్లెలు, తండాలు అడుగు ముందుకు వేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, తండాలుగా మారిన 4383 గ్రామపంచాయితీలు గురువారం నుంచి తమ పాలనకు శ్రీహారం చుట్టాయి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయితీలలో పండగ వాతావరం నెలకొంది. తండాలలో ప్రజలు స్వీట్లు పంచుకోగా, చాలా ప్రాంతాలలో డప్పు, వాయిద్యాలతో పంచాయతీలకు ప్రారంబోత్సవాలు చేశారు. కొత్తగా ఏర్పడిన పంచాయితీలలో చాలా వరకు ర్యాలీలు నిర్వహంచారు. పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌ ర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలి దేవినేని పల్లిలో కొత్త పంచాయితీని మంత్రి ప్రారంభించారు. మంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు కొత్త పంచాయితీలను ప్రారంభించారు. కల్వకుర్తిమండలంలో ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించగా, మహబుబాబాద్‌ జిల్లా పెదవంగర మండలంలో పది గ్రామపంచాయితీలను ఎంఎల్‌ఏ ఎర్రబెల్లి దయకర్‌రావు ప్రారంభించారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారులు
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయితీలన్నింటిలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12741 పంచాయితీలలో ప్రత్యేకాధికారులు తమ బాధ్యతలు స్వీకరించారు. పంచాయితీలకు ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన పుణ్యం కేసిఆర్‌దే: ఎమ్మెల్సీ రాములునాయక్‌
దశాబ్దాల తరబడి అభివృద్దికి అమాడదూరంలో ఉన్న గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చిన పుణ్యం, ముఖ్యమంత్రి కేసిఆర్‌దేనని ఎమ్మెల్సీ రాములునాయక్‌ కొనియాడారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలుగా మారిన ఈనెల రెండో తేదీ నుంచి గిరిజన గూడేలు, తండాలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చి జాతీయ జెండా రెపరెపలాడుతూ పండగ వాతావరణం నెలకొందన్నారు. మాగ్రామం-మా పాలన అన్న ఆత్మగౌరవం గిరిజన జాతిలో పెరిగిందన్నారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామ స్వరాజ్యం వచ్చేలా కృషి చేస్తున్న దార్శనిక నేత కేసిఆర్‌ అని, గిరిజనుల ఏండ్ల తరబడి తమ తండాలను గ్రామ పంచాయతీలు కావాలన్న కోరికను నెరవేర్చిన కేసిఆర్‌కు యావత్‌ గిరిజన జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలకు ఎన్నికల సమయలోనే తండాలు గుర్తుకు వచ్చేవని, గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగానే చూశారని, ఎన్నికల యిపోగానే తండాల వైపు కూడా తిరిగి చూడలేదని, కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. గిరిజనులు ఓట్లువేయడానికి దూరంగా ఉన్న వేరే గ్రామాలకు పోవాల్సిన పరిస్థితి ఉండేదని, అక్కడ తమకు అనుకూలంగా ఓట్లు వేయలేదని గిరిజనులను కొట్టేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సందర్బంగా గిరిజన తండాలో పల్లెనిద్ర చేసిన కేసిఆర్‌ అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఇంత దుర్మార్గమా? అని ఆవేదన చెందారన్నారు. మన రాష్ట్రం రాగానే తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఆనాడే అన్నారనీ, అన్న మాటన నిలబెట్టుకొని ఆయన గిరిజనుల పాలిట దేవుడయ్యారని రాములునాయక్‌ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగకుండా కోర్టుకెళ్లిన కాంగ్రెస్‌ దాదాపు 2 వేల మంది గిరిజనుల సర్పంచ్‌లు, వార్దుసభ్యులు కాకుండా అడ్డుపడిందని విమర్శించారు. గిరిజనులంతా టిఆర్‌ఎస్‌ వైపేనని 20 ఏళ్ల వరకూ కేసిఆరే సిఎంగా ఉంటారని, కొత్తగా ఏర్పాటైన అన్ని గిరిజన పంచాయతీల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా గెలిపించుకుని కేసిఆర్‌కు కానుకగా ఇస్తామని రాములునాయక్‌ వెల్లడించారు.