‘పంచాయతీ’ లో పవర్ చూపితేనే టిక్కెట్లు
‘పంచాయతీ’లో పవర్ చూపితేనే టిక్కెట్లు

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కెసిఆర్ టార్గెట్లు
హైదరాబాద్: రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఖాయమని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదట్లో స్పష్టం చేసినప్పటికీ ఇప్పుడు గెలుపు లక్ష్యంగానే సర్దుబాట్లు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల సీట్లు పెరగనందున టిఆర్సేతర స్థానాల్లో మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న వారికి ఈసారి టిక్కెట్లు సర్దుబాటు చేయడం కోసం నేతల్లో పోటీ పెట్టనున్నారని తెలుస్తోంది. దీనికి రాబోయే పంచాయతీ ఎన్నికలను వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు.నేరుగా టిఆర్ఎస్ టిక్కెట్‌తో గెలిచిన వారికి, వలస వచ్చిన ఎమ్మెల్యే లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఖాయం చేద్దామని ఆయన మొదట్లో భావించినా, కర్ణాటక ఎన్నికల్లో సిట్టింగ్ ప్రభుత్వం ఓడి పోవడంలో పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత కూడా పని చేసిందని సమాచారం. అందుకని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయం తీసుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేల సామర్థ్యం, ఆశావాహుల సామర్థం పరీక్షించాలని భావిస్తున్నారు.పార్టీ నేతలకు ఉన్న పవర్ ఏంటో పంచాయతీ ఎన్నికల్లో చూడాలని కెసిఆర్ ఆకాంక్షిస్తున్నారు. ప్రజలను ఆకర్శించే రైతుబంధు పథకం, రాబోయే కంటి వెలుగు పథకం వంటివి ఎన్నో ఉన్నా, స్థానికంగా నేతల సామ ర్థ్యం కూడా ఎన్నికల్లో అవసరం ఉంటుందని అధిష్ఠానం భావన, పొరుగు రాష్ట్రమైన కాంగ్రెస్ ప్రజలను ఆకర్శించే పథకా లను ఎన్నో చేపట్టింది.ఎన్నికల షెడ్యూల్ సంకేతాలు రాక ముందే లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించి బిజెపిని పరేషాన్ చేసింది అయినా ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడింది. జెడిఎస్‌తో చేతులు కలపడంతో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుని పరువును కాపాడుకుంది. ఎఐసిసి నూతన అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మొదటి విక్టరీ లభించినట్లయింది. తెలంగాణలో టిఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, ఎలాంటి హంగ్‌లు రావద్దనే కోరుకుంటుంది. అందుకనే ఇప్పటి వరకు అంతర్గతంగా నిర్వహించిన మూడు సర్వేలో 102 సీట్ల వరకు టిఆర్ఎస్ గెలువచ్చనే అంచనాలను నిజం చేయాలని తపనతో కెసిఆర్ ఉన్నారు. కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి కర్ణాటకలోని జెడిఎస్ తరహాలో కొన్ని సీట్లు గెలిచి కింగ్ మేకర్ లేదా కింగ్ కావచ్చనే సర్వే ఒకటి బయటకు వచ్చింది.
రాష్ట్రంలో గెలుపు స్థానాలపై సిఎం కెసిఆర్‌కు పట్టు ఉన్నా, అక్కడ అభ్యర్థులు ఎవరు ఉంటే బాగుంటుందనే విషయంపై స్పష్టతకు రాలేకపోతున్నారు.అందుకని పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపితేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలువచ్చనేది ఆయన అంచనా. పంచాయతీ ఎన్నికలు ముందుస్తు మినీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో భావించే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు బంధు పథకంతో గ్రామీణులకు దగ్గరైన కెసిఆర్, త్వరలో ప్రారంభమయ్యే కంటి వెలుగు పథకంతో మళ్లీ గ్రామాల్లో హడావుడి నెలకొంటుంది. హడావుడి పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ జెండాను రెపరెపలు లాడిస్తుంది. అందుకని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ టిక్కెట్లు ఆశిస్తున్న వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కించుకోవాలంటే ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతీ పథకాన్ని విజయవంతంగా అమలయ్యేలా దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ను అడుగడుగునా విమర్శిస్తూ ప్రజల వద్దకు టిఆర్ఎస్ను మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్లు, ఏ పదువులు లేకపోయినా జిల్లాల్లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నవారు సిట్టింగ్‌లను తప్పించి టిక్కెట్లు తమకే కావాలంటూ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో సీరియస్‌గానే అభివృద్ది పనుల్లో, సంక్షేమ పథకాల అమలుల్లోనూ పాల్గొం టున్నారు. ఈసారి తమకు అవకాశం ఇచ్చి కుదరని మంత్రులకు, సీనియర్ నేతలకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. మొత్తంగా పరిస్థితుల మేరకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉండకుండా సిట్గింగ్ ఎమ్మెల్యే లు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా, వారి కళ్ల ముందే కొందరు టిఆర్ఎస్ టిక్కెట్ల కోసం హైదరాబాద్‌కు వచ్చి మకాం వేయడం,వారిలో కొందరు మంత్రి కెటిఆర్ సన్నిహితుల చుట్టూ తిరగడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో జూనియర్ ఎమ్మెల్సీలు బాగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కొందరు ఎమ్మెల్సీలు కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతే, తాము తప్పకుండా మంత్రులం అవుతామని ఆశతో ఉన్నారు.
కొత్తగా టిక్కెట్లు కోరుతున్నవారు, తటస్థులు, బిజినెస్మెన్లు, ఎన్ఆర్ఐలు పలువురు ఎమ్మెల్సీలతో టచ్‌లో ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ పోటీ చేసేది ఉండదు.దీంతో వారు సిట్టింగ్‌లకు ఎసరు పెడుతూ ఈసారి టిక్కెట్ల కోరుకుంటున్న ఆశావాహులకు అండగా ఉండనున్నారని తెలుస్తోంది. అందుకనే అశావా హులు వారిని వెంట తీసుకుని కెటిఆర్ వద్దకు అప్పడప్పుడు వెడుతున్నారని తెలుస్తోంది.మొత్తంగా వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ టిక్కెట్ల ఎంపిక సమస్యగానే మారనుంది. ఇదే సమయంలో కెటిఆర్ పాత్ర కీలకం కానుందని ప్రచారం జోరందుకుంది. టిక్కెట్ల విషయంలో కెసిఆర్ వద్దకు ఏ సీనియర్ నేత దూరే అవకాశం ఎలాగూ ఉండదు. ఇదంతా గొడవలెందుకని జూనియర్ నేతలు నేరుగా కెటిఆర్‌ను కలుస్తున్నారు.2019 ఎన్నికల తర్వాత కెటిఆర్ సిఎం అయ్యే అవకాశం కెసిఆర్ ఇవ్వదలచుకుంటే, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆయన పాత్ర తప్పకుండా ఉంటారని చెబుతున్నారు. టిఆర్సేతర స్థానాల్లో టిక్కెట్ల ఎంపిక విషయంలో ఎంత కసరత్తు చేసినా పరవాలేదని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్త ముఖాలను ముందుకు తీసుకొస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ టిక్కెట్లే తమకే అని ఎంతో భరోసాతో తాము నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేస్తుంటే,ఇదేంటీ హైదరాబాద్‌లో కొత్త ముఖాలు ముందుకు వస్తున్నాయని ఆందోళన చెందు తున్నారు. ఇటీవల పార్టీ ప్లీనరీలో సిట్టింగ్‌లకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ స్పష్టంగా హామీ ఇచ్చినా గుండెల్లో గుబులు అలాగే ఉంది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారితో ఇబ్బందులు పడుతున్నామని,టిక్కెట్ల భరోసా కూడా లేకుండా చేస్తారా? అని బాధ పడుతున్నారు.అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చూపించి పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తామని తర్వాత అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో కెసిఆర్ దయ అని అంటున్నారు.